Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'కల్లోల భారతం, తిరోగమన భారతం' పుస్తకాల ఆవిష్కరణ సభలో తమ్మినేని వీరభద్రంనవతెలంగాణ-వైరాటౌన్
దేశంలో మరణమృదంగానికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శుక్రవారం వైరా స్టడీ సర్కిల్ ముద్రణ చేసిన 'కల్లోల భారతం, తిరోగమన భారతం' పుస్తకాల ఆవిష్కరణ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు అధ్యక్షతన జరిగిన సభలో తమ్మినేని వీరభద్రం ముఖ్య అతిథిగా ఆన్లైన్లో ప్రసంగించారు. కరోనా వ్యాపించకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే దేశంలో వేలాది మంది ప్రజలు మృత్యువాత పడుతున్నారన్నారు. అంతర్జాతీయ వైద్య నిపుణుల సూచనలను భారత ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని, ఫలితంగా దేశంలో శ్శశానవాటికలలో మంటలు ఆగడం లేదని, ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగులకు కనీసం ఆక్సిజన్ అందించలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వ విద్య, వైద్యం కోసం ప్రజలు అందరూ ఉద్యమించాల్సిన తరుణం ఆసన్నమైంది అన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ దేశంలో అత్యంత ప్రమాదకరమైన విభజన రాజకీయాలు తీసుకు వచ్చి ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించకుండా పాలకవర్గం కార్పోరేట్ సంస్థలకు పెద్ద పీట వేస్తన్న ఫలితంగా మధ్యతరగతి, సామాన్య ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారన్నారు. వైరా స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలపై సులభతరమైన పుస్తకాలు ముద్రణ చేయడం అభినందనీయమన్నారు.
న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ ప్రపంచంలో అనేక దేశాలు కోవిడ్ నియంత్రణలో విజయవంతంగా ముందుకు సాగుతున్నాయని, భారతదేశంలో మాత్రం కరోనా విజృంభణకు ప్రభుత్వ విధానాలు దోహద పడుతున్నాయన్నారు. వైరా స్టడీ సర్కిల్ కన్వీనర్ బోడపట్ల రవీందర్ శ్రమకోర్చి పుస్తకాలు ముద్రణ చేయడం అభినందనీయమన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు మాట్లాడుతూ గత సంవత్సరకాలంగా దేశంలో కోట్లమంది ప్రజలు తమ ఆదాయాలు కోల్పోయి, జీవనం కష్టభరితం అవుతున్న సమయంలో అంబానీ గంటకు 90 కోట్ల రూపాయల ఆదాయం పొందుతారన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల ఆదాయాలను పెంచే విధానాలు అనుసరిస్తుందన్నారు. కల్లోలభారతం పుస్తకాన్ని పోతినేని సుదర్శన్ పరిచయం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు గ్రామీణ ప్రాంతాలలో ప్రజల ఉపాధిని మరింతగా హరిస్తాయన్నారు. నిరుద్యోగం పెరుగుతుందని, వలస కార్మికులు ఉపాధి కోల్పోయి జీవనం కష్టబరితం అవుతున్న ప్రజలను ఆదుకో వడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ప్రముఖ విద్యావేత్త ఐ.వి. రమణారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక, రాజకీయ, సామాజిక విధానాలు దేశాన్ని మధ్య యుగాల ఆలోచనల వైపు నడుపుతూ ప్రజలను మూడవిశ్వాలలో ఉంచే కుట్ర చేస్తున్నారన్నారు. తిరోగమన భారతం, సంఘర్షణ-సహళ్ళు పుస్తకాన్ని ఐ.వి. రమణారావు పరిచయం చేశారు. కార్యక్రమంలో సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి కె.అనంధచారి, సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు, ఇంగ్లీష్ అనువాద వ్యాస సంకలనం చేసిన వైరా స్టడీ సర్కిల్ కన్వీనర్ బోడపట్ల రవీందర్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కవి, రచయిత డాక్టర్ సీతారాం, మువ్వా శ్రీనివాసరావు, టి.లక్ష్మీనర్సయ్య, బండారు రమేష్, మల్లెంపాటి వీరభద్రం, తోట నాగేశ్వరావు, చింతనిప్పు చలపతిరావు, మందడపు రామారావు, చెరుకుమల్లి కుటుంబరావు అనుమోలు రామారావు, మల్లెంపాటి ప్రసాదరావు, వర్మ పాల్గొన్నారు.