Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బోనకల్
కోవిడ్ రెండోదశలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో మరణించటం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని టీఎస్ యుటిఎఫ్ జిల్లా కోశాధికారి వల్లంకొండా రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నెల రోజులుగా ప్రతిరోజూ సగటున ఐదుగురు ఉపాధ్యాయులు కరోనాతో మత్యువాత పడుతున్నారని అన్నారు. దీంతో ఉపాధ్యాయుల్లో భయానక వాతావరణం నెలకొన్నదని అన్నారు. 14 మే నాటికి మరణించిన ఉపాధ్యాయుల జాబితాను టీఎస్ యుటిఎఫ్ విడుదల చేసిందన్నారు. మొత్తం 185 మంది ఉపాధ్యాయులు మరణించగా సర్వీసులో ఉన్నవారు 166మంది, విశ్రాంత ఉపాధ్యాయులు 59 మంది ఉన్నారన్నారు. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 25 మంది, హైదరాబాద్ లో 16మంది మరణించారని తెలిపారు. నాగార్జునసాగర్ అసెంబ్లీ, వరంగల్, ఖమ్మం మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల విధులు నిర్వహించిన ఉపాధ్యాయులలో ఐదు వందలమందికి పైగా కరోనా సోకగా ఇప్పటికే 15 మంది వరకు మరణించారు అని అన్నారు. మొత్తం మరణించిన వారిలో నలబై ఏళ్ళ లోపు వారే అధికంగా ఉండటం గమనార్హం అన్నారు. కోవిడ్ చికిత్స కోసం స్థానిక ప్రైవేటు, కార్పోరేట్ హాస్పిటల్స్లో చేరి లక్షల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ ప్రాణాలు దక్కకపోగా కుటుంబాలు అప్పుల పాలు అవుతున్నాయని తెలిపారు. కెజిబివి కాంట్రాక్టు ఉపాధ్యాయులకైతే ఏ ఆసరా లేక కుటుంబాలు వీధుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల కోవిడ్ మరణాలపై ప్రత్యేక దృష్టి పెట్టి నివారణకు చర్యలు తీసుకోవాలని, వ్యాక్సినేషన్లో ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇవ్వాలని, మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలను ఆదుకోవాలని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా చేసిందన్నారు. కోవిడ్ చికిత్సకు ప్రైవేటు ఆసుపత్రుల్లో 10 లక్షల నుంచి ఇరవై లక్షలు వరకు ఖర్చవుతుంది అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక లక్ష రూపాయలు మాత్రమే తిరిగి చెల్లిస్తుంది అన్నారు. అదికూడా రిఫరల్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారికి మాత్రమే అవకాశం ఉందన్నారు. కోవిడ్ చికిత్సకు అనుమతించిన ఆసుపత్రులన్నీ రిఫరల్ ఆసుపత్రులు కానందున ఆ లక్ష రూపాయలు కూడా తిరిగి పొందగలిగే పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ చికిత్సకు అనుమతించిన ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్న ఉపాధ్యాయులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం వర్తింపజేయాలని, వైద్య ఖర్చుల తిరిగి చెల్లింపుపై లక్ష రూపాయల గరిష్ట పరిమితిని ఎత్తివేయాలని, ఆరోగ్య కార్డులపై నగదురహిత వైద్యం అందించేటందుకు చర్యలు తీసుకోవాలని, ఎన్నికల విధుల్లో కోవిడ్ సోకి మరణించిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, మరణించిన కాంట్రాక్టు ఉపాధ్యాయుల కుటుంబాలకు ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశం కల్పించాలని టీఎస్ యుటిఎఫ్ డిమాండ్ చేస్తుందన్నారు. విలేకర్ల సమావేశంలో మండల అధ్యక్షులు కంభం.రమేష్, మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.