Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుండెపోటుతో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు బండి పాండయ్య మృతి
నవతెలంగాణ-కొణిజర్ల
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల పరిధిలోని బస్వాపురం గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు కామ్రేడ్ బండి పాండయ్య గుండెపోటుతో బుధవారం ఉదయం ఖమ్మంలోని తన నివాసంలో మృతి చెందారు. పాండయ్యది మధ్యతరగతి కుటుంబమే కాక పాండయ్య తండ్రి కాంగ్రెస్ పార్టీ నాయకులు. అయినప్పటికీ పాండయ్య చిన్నతనంలో మండలానికి చెందిన సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు సంక్రాంతి మధుసుదన్ రావు నాయకత్వంలో పేదప్రజల సమస్యలపై పార్టీ చేస్తున్న ఉద్యమాలకు ఆకర్షితుడై తండ్రిని విబేధించి సీపీఐ(ఎం)లో చేరారు. పార్టీ అభివృద్ధికి శక్తివంచనలేకుండా కృషి చేశారు. గ్రామంలో సూమారు 30 సంవత్సరాలపాటు సీపీఐ(ఎం) సర్పంచ్లను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. పార్టీ బాధ్యతలను చూస్తునే వ్యవసాయ కార్మిక, రైతు సంఘంలో పనిచేస్తూ ఆదర్శంగా నిలిచారు. పార్టీ ఏ పని అప్పగించినా కాదనకుండా చేసేవారు. పాండయ్యకి ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై తప్పుడుకేసులు బనాయించి జైల్లో పెట్టించి చిత్రహింసలకు గురిచేసినా పార్టీని వీడలేదు. పోలీసులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు కొట్టిన దెబ్బలకు ఆనారోగ్యానికి గురయ్యారు. అదే సమయంలో షుగర్ వ్యాధి సోకడంతో రెండుకాళ్లు కోల్పోయాడు. దీంతో గతకొంత కాలంగా ఖమ్మంలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయినప్పటికీ వీలుచైరులో కూర్చోని పార్టీ కార్యక్రమాలకు హాజరయ్యేవారు. పార్టీ అంటే ఎనలేని అభిమానంతో ఉండేవాడు. పాండయ్యకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.
పాండయ్య మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
కామ్రేడ్ బండి పాండయ్య మరణం ప్రజాఉద్యామాలకు తీరనిలోటని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. పాండయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆయన పాండయ్య పార్థివ దేహంపై పార్టీ జెండా కప్పి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాండయ్య పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కోసం తుదిశ్వాస వరకు పోరాడారన్నారు. గ్రామంలో ప్రతిపక్ష పార్టీలు ఏకమై అనేక సార్లు పాండయ్యపై హత్యచేసేందుకు ప్రయత్నించిన వాటిని ముందుగానే పసిగట్టి తప్పించుకుంటూ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించారన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైన ధైర్యంగా ఎదుర్కోంటు ఎర్రజెండాను వీడకుండా ప్రతిపక్ష పార్టీలకు ముచ్చెమటలు పట్టించిన చరిత్ర కలిగిన నాయకుడు పాండయ్య అని అయన ఆశయ సాధనకోసం రాబోయే రోజుల్లో బలమైన ప్రజాఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. నివాళులర్పించిన వారిలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భూక్య వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు బొంతు రాంబాబు, మండల కార్యదర్శి తాళ్లపల్లి క్రిష్ణ, రైతు సంఘం జిల్లా నాయకులు చింతనిప్పు చలపతిరావు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు, తాటిపల్లి శ్రీను, డీవైఎప్ఐ నాయకులు చల్లా రవి, సింగరాయపాలెం మాజీ సొసైటీ ఛైర్మన్ పోలుదాసు, బాబు తదితరులు పాల్గొన్నారు.