Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోనకల్లో 25 రోజుల వ్యవధిలో 20 మంది మృత్యువాత
- కరోనా వ్యాధితో తల్లడిల్లుతున్న గ్రామాలు
- నాడు డెంగ్యూ... నేడు కరోనా కలకలం
నవతెలంగాణ-బోనకల్
బోనకల్లో కరోనా మరణ మృదంగం కొనసాగుతూనే ఉంది. కేవలం ఇరవై రెండు రోజుల వ్యవధిలోనే 20 మంది కరోనా బారినపడి మృత్యువాత పడ్డారు. మండలంలో 22 గ్రామాలు ఉండగా 12 గ్రామాలలో కరోనా మరణాలు నమోదు అయ్యాయి. కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రతిరోజు కరోనా టెస్టుల కోసం 100 నుంచి 150 మంది వరకు వస్తున్నారు. కానీ ప్రభుత్వం కరోనా నిర్ధారణ కిట్లు సరఫరా మాత్రం ప్రజలకు అనుగుణంగా మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చేయటం లేదు. రోజుకి 50 మందికి మించి కరోనా టెస్ట్ లు నిర్వహించడం లేదు. గ్రామాలలో కరోనా మృతుల సంఖ్య పెరుగుతుండటంతో భయంతో ప్రజలు పెద్ద సంఖ్యలో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి టెస్టుల కోసం పరుగులు తీస్తున్నారు. ప్రభుత్వం రెండవ డోస్ మాత్రమే వేస్తుండటంతో మొదటి డోసు కోసం వచ్చిన వారు నిరాశతో వెళ్ళిపోతున్నారు. మండలంలో 20 మంది కరోనా వ్యాధితో మృత్యువాత పడగా అందులో ముగ్గురు మహిళలు ఉన్నారు. 17 మంది పురుషులు ఉన్నారు. అత్యధికంగా మండల కేంద్రమైన బోనకల్లో నలుగురు కరోనా వ్యాధితో మృత్యువాత పడ్డారు. చిరునోములలో ముగ్గురు, ముష్టికుంట, మోటమర్రిలలో ఇద్దరు చొప్పున మృత్యువాత పడ్డారు. ముష్టికుంట గ్రామ పంచాయతీ కార్యదర్శి పల్లా సుధీర్ మొట్టమొదటగా కరోనా వ్యాధితో మృతి చెందాడు. ముష్టికుంట్ల గ్రామానికి చెందిన లేబర్ అసిస్టెంట్ ఆఫీసర్ కొమ్ము కుటుంబరావు కరోనాతో మృతి చెందాడు. బోనకల్ గ్రామానికి చెందిన ఉస్మానియా వైద్యుడు వజ్రాల యుగంధర్ రాజేష్, వత్సవాయి అశోక్, మోర్ల నాగేశ్వరరావు, మోర్ల వరలక్ష్మి, రావినూతల గ్రామానికి చెందిన ప్రముఖ మెడికల్ షాప్ యజమాని బచ్చు నాగ సీతారామారావు, మోటమర్రి గ్రామానికి చెందిన మోటమర్రి ఎంపీటీసీ మరీదు నరసింహారావు, మోటమర్రి సహకార సంఘం సీఈవో చిట్టుమోదు వెంకటేశ్వర్లు కరోనాతో మృతిచెందారు. చిరునోముల గ్రామానికి చెందిన పత్తిపాటి వెంకటేశ్వర్లు, పిడతల రామారావు, రెంటాల నారాయణ, గోవిందాపురం ఏ గ్రామానికి చెందిన సర్పంచ్ సతీమణి భాగం రమాదేవి, కలకోట గ్రామానికి చెందిన గద్దల రాణి, ఆళ్లపాడు గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బుంగ బాలరాజు, రామాపురం గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్ నాయకుడు గుడిపూడి వెంకయ్య, రాయన్న పేట గ్రామానికి చెందిన మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జంగా రవికుమార్ మాతృమూర్తి జంగా రోహిణి, చిన్న బీరవల్లి గ్రామానికి చెందిన ముళ్ళపాటి చిట్టిబాబు పెద్ద బీరవల్లి గ్రామానికి చెందిన నాగటి రాయప్ప, నాగటి మోక్షం కరోనా వ్యాధితో మృత్యువాత పడ్డారు. ఆయా గ్రామాల ప్రజలు కరోనా భయంతో తల్లడిల్లిపోతున్నారు.
2016లో డెంగ్యూ తో 22 మంది మృతి
2016 సంవత్సరంలో మండలంలో డెంగ్యూ వ్యాధి తన విశ్వరూపం చూపించి మండల ప్రజలను గడగడలాడించింది. ఆనాడు మండలంలోని అన్ని గ్రామాలలో ప్రతి ఇంటిలో కనీసం ఒక్కరు డెంగ్యూ బారిన పడ్డారు. ఈ డెంగ్యూ వ్యాధితో 22 మంది మృత్యువాత పడ్డారు. మరల 2021 సంవత్సరంలో కరోనా వ్యాధితో కేవలం 25 రోజుల వ్యవధిలోనే 20 మంది మృత్యువాత పడటం సంచలనంగా మారింది.