Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముందుచూపుతో రాష్ట్రంలోనే మొదటి పిల్లల కోవిడ్ వార్డు ఏర్పాటు చేశాం
- నిబంధనలు ఉల్లంఘించే ప్రయివేట్ ఆస్పత్రులపై చర్యలు తప్పవు
- కోవిడ్ వైద్యసేవల్లో ముందున్నాం : మంత్రి పువ్వాడ
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కోవిడ్ వైద్య సేవల్లో ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని అగ్రస్థానంలో నిలబెట్టామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి చిన్న పిల్లల కోవిడ్ సంరక్షణ ప్రత్యేక వార్డును ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో బుధవారం మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. కోవిడ్ తీవ్రతను దష్టిలో ఉంచుకొని మూడో దశలో చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న వార్తల నేపథ్యంలో మొదటి కోవిడ్ ప్రత్యేక వార్డును 40 పడకలతో ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రులలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని 550 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసుకున్నామన్నారు. 2015లో ఆక్సిజన్ బెడ్స్ ఏమీ లేవని, ప్రస్తుతం 300 ఆక్సిజన్ బెడ్స్ ను ఏర్పాటు చేశామన్నారు. 35 వెంటిలేటర్లు, 5 హెచ్.ఎఫ్.ఎన్.సిలు, 10 సి.పి.ఏ.పిలు, 30 మల్టీ పారా మీటర్లు, 10 కార్డియాలజీ యూనిట్స్, 10 నెప్రాలజీ యూనిట్స్, 13 కె.ఎల్ లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సెంట్రల్ ఆక్సిజన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. కరోనా కట్టడిలో ఖమ్మం జిల్లా ముందంజలో ఉందన్నారు. జిల్లా ఆసుపత్రితో పాటు సత్తుపల్లి, మధిర, పెనుబల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కూడా ఆక్సిజన్ బెడ్స్, రెమ్ డెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉంచామన్నారు. జిల్లాలో కోవిడ్ పాజిటివ్ రేటు తగ్గుముఖం పడుతుందని తెలిపారు. రెండు విడతలుగా చేపట్టిన ఇంటింటి సర్వే ద్వారా ఇప్పటికే 8 లక్షల గహాల సర్వే పూర్తి చేసుకున్నామన్నారు. రోగ లక్షణాలు కలిగిన వారికి సత్వర చికిత్స అందించడంతో ప్రజలను కోవిడ్ నుండి ఉపశమనం కల్గించామని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్, రెమ్ డెసివిర్ ఇంజక్షన్ల నిల్వ ఉన్నాయని మంత్రి తెలిపారు. విదేశాలలోని ఖమ్మం జిల్లా నివాసితులు ఆక్సిజన్ కాన్సెన్టర్స్ ను అందిస్తున్నారని తెలిపారు. వాటిని ప్రభుత్వ ఆసుపత్రులలో వినియోగించడంతో పాటు పేషెంట్లకు ఇంటి దగ్గర అవసరమున్న వారికి కూడా ప్రభుత్వ పరంగా అందిస్తామని మంత్రి తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత ప్రజలకు కూడా ప్రభుత్వ రంగ వైద్య సేవలు సులభతరంగా అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేశారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లఘించిన ప్రయివేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోక తప్పదన్నారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 40 పడకలతో చిన్న పిల్లల ప్రత్యేక కోవిడ్ సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. జిల్లాలో చేపట్టిన ఇంటింటి సర్వే ద్వారా 10 సంవత్సరాలలోపు 2 వందల మంది చిన్న పిల్లలకు కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. చిన్న పిల్లల ప్రత్యేక కోవిడ్ వార్డులో ఆక్సిజన్, ఐ.సి.యు సపోర్టు వైద్య సేవలతో పాటు పౌష్టికాహారాన్ని అందించే ఏర్పాటు చేశామన్నారు. చిన్న పిల్లల కోవిడ్ వార్డులలో బెడ్స్, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లనూ ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో నగరమేయర్ పునుకొల్లు నీరజ, , జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి అభివద్ధి కమిటీ చైర్మన్ లింగాల కమలరాజు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్ బచ్చు విజరు కుమార్, నగర డిప్యూటీ మేయర్ ఫాతీమా జోహారా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా,మాలతి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా,బి. వెంకటేశ్వర్లు, ఆర్.ఎం.ఓ డా,బి. శ్రీనివాసరావు పాల్గొన్నారు.