Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూసేకరణపై ఐక్య ఉద్యమం
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-రఘునాథపాలెం
కోవిడ్‌తో ప్రజల ప్రాణాలు పోతున్న పరిస్థితుల్లో నాగపూర్ టు అమరావతి నేషనల్ హైవే భూ సేకరణ కోసం దొడ్డిదారిన గెజిట్ విడుదల చేయడం సరైనది కాదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. బుధవారం జరిగిన భూ నిర్వాసిత రైతుల ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ రఘునాధపాలెం మండలానికి చెందిన కామంచికల్, రేగులచేలక, రఘునాథపాలెం, బల్లేపల్లి, వి.వెంకటాయ పాలెం, ఖమ్మం రూరల్ మండలానికి చెందిన తీర్ధాల, మంగళ గూడెం గ్రామాల పరిధిలో గత సంవత్సరం భూసేకరణ కోసం గెజిట్ విడుదల చేశారని, రైతులు ఐక్యంగా భూసేకరణకు వ్యతిరేకంగా ఉద్యమించడం ద్వారా సంవత్సరం పాటు భూసేకరణ జరగకుండా ఆపగలిగారని తెలియజేశారు. సంవత్సరం పూర్తయిన తర్వాత గెజిటెడ్ రద్దయిందని గుర్తుచేశారు. ప్రస్తుతం కరోనా వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, లాక్డౌన్ పరిస్థితిలో రైతులు ఎటూ కదలలేని సందర్భం చూసి ప్రభుత్వం మరలా తిరిగి భూసేకరణ కోసం బుధవారం ప్రముఖ దినపత్రికలలో గెజిట్ విడుదల చేసిందని వారు తెలిపారు. రైతులు బయటికి వెళ్లలేని లాక్ డౌన్ పరిస్థితుల్లో కనీసం అభ్యంతరాలు తెలుపుటకు అవకాశం లేని సందర్భం చూసి గెజిట్ విడుదల చేయడాన్ని వారు తప్పుపట్టారు. దొడ్డిదారిన భూసేకరణ చేసే ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వ్యతిరేకంగా రైతులు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గెజిట్‌లో చూపించిన సర్వేనెంబర్లన్నీ బహుళ పంటలు పండే భూములను వారు అన్నారు. అట్లాంటి భూములను రోడ్ల కోసం సేకరణ చేయాలని చూడటం సరి కాదని వారన్నారు. రాబోయే పది సంవత్సరాల్లో ఖమ్మం పట్టణం ఎటు చూసినా 10 కిలోమీటర్ల మేర విస్తరించి అవకాశం ఉన్నందున, ఈ రోడ్డు వల్ల పట్టణ విస్తరణ ఆగిపోయే ప్రమాదం ఉందని అన్నారు. తక్షణమే ఈ గెజిటెడ్ వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఎస్.నవీన్ రెడ్డి, రైతు సంఘం నాయ కులు తక్కెళ్ళపాటి భద్రయ్య, చెరుకూరి మురళీకృష్ణ, భూక్య కృష్ణ, ప్రతాపనేని వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.