Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు
నవతెలంగాణ-వైరా టౌన్
ఏరువాకతో రైతుల సమస్యలకు పరిష్కారం చూపాలని, వైరా నియోజకవర్గ పరిధిలో ధాన్యం రైతుల గోసకు కారణం రాజకీయ ఆధిపత్య పోరు అని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు అన్నారు. బుధవారం వైరా మండలంలో కురిసిన వర్షంకు ధాన్యం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతులు ఇంతటి నరకయాతన తమ జీవిత కాలంలో పడలేదని రైతు సంఘం బృందం ఎదుట రైతులు వాపోయారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలలో ధాన్యం రైతుల పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా బొంతు రాంబాబు మాట్లాడుతూ జిల్లా మంత్రి పువ్వాడ అజరు కుమార్, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారుల సమీక్షలతో ధాన్యం రైతుల ఇబ్బందులు పరిష్కారం కాలేదని అన్నారు. వైరా మండలంలో 18000 ఎకరాలలో యాసంగి సీజనులో వరి పంట సాగు చేశారని, ధాన్యం కొనుగోలుకు అవసరమైన చర్యలు ప్రభుత్వం సక్రమంగా తీసుకోలేదని, డిసియంఎస్ కొనుగోలు కేంద్రాలలో రైతుల పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉందని, రెండు నెలల పూర్తి అవుతున్న కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కటాలు పూర్తి కాలేదని, కటాలు అయిన బస్తాలను మిల్లులకు తరలించ లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారని అన్నారు. జిల్లా అధికారులు ఒకరు కూడా వైరా నియోజకవర్గం లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన సందర్భం లేదని, వైరా, కొణిజర్ల మండలాలలో యాసంగి సీజనులో వరి ధాన్యం రైతుల తీవ్ర ఇబ్బందులకు జిల్లా అధికారులు పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం బస్తాలను యుద్ద ప్రాతిపదికన మిల్లులకు తరలింపు కోసం అవసరమైన వాహనాలను ఏర్పాటు చేయాలని, లేకపోతే సమీప ప్రభుత్వ పాఠశాలలోకి తాత్కాలికంగా తరలించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం నాయకులు శీలం వెంకటరెడ్డి, మాగంటి తిరుమల రావు, సిఐటియు జిల్లా నాయకులు సుంకర సుధాకర్, తోట నాగేశ్వరావు, శీలం విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.