Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖమ్మం జిల్లాలో 248 మి.మీ వర్షపాతం
- కొత్తగూడెం జిల్లాలో రెండు మండలాలకే పరిమితం
- ఖమ్మం పరిసరాల్లో తడిసిముద్దైన ధాన్యం కొనుగోళ్లు పూర్తికాని రైతుల్లో నైరాశ్యం..
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రుతుపవనాల ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం కురిసిన వర్షంపై రైతుల్లో భిన్న స్పందనలు కనిపిస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లు పూర్తయిన రైతుల్లో హర్షం వ్యక్తమవుతుండగా...తొలకరి పనులకు హుషారుగా కదిలారు. కొనుగోళ్లు పూర్తికాని రైతుల్లో మాత్రం నైరాశ్యం అలుముకుంది. వడ్లు నీటిపాలు కావడంతో కన్నీరు పెడుతున్నారు. గురువారం ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. ఖమ్మం జిల్లాలో ఏడెనిమిది మండలాల మినహా అన్నిచోట్లా వర్షం కురవగా కొత్తగూడెం జిల్లాలో మాత్రం గుండాల, ఇల్లెందు మండలాల్లోనే 20 మి.మీ పైగా వర్షం పడింది. ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే వర్షం కురవడంతో రైతులు సంతోషంతో ఏరువాక ఆరంభించారు. అయితే ఇప్పటికీ 20శాతం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉండటంతో పలుచోట్ల తడిసిపోయాయి. సంబంధిత రైతులు ఈ వర్షంపట్ల ఆవేదనతో ఉన్నారు.
ధాన్యం రైతులు ఆగం
ఖమ్మం పరిసర మండలాల్లో గురువారం ఉదయం 7 గంటల నుంచి ఎడతెగకుండా 10 గంటల వరకు వర్షం కురిసింది. ఏప్రిల్ మొదటి వారం నుంచి మొదలైన ధాన్యం కొనుగోళ్లు ఇప్పటికీ పూర్తి కాలేదు. ధాన్యం కొనుగోళ్లు పూర్తయిన రైతులు ఈ వర్షంతో ఉత్సాహంగా వ్యవసాయ పనులు మొదలుపెట్టగా... కొనుగోళ్లు పూర్తికాని వారు గగ్గోలు పెడుతున్నారు. ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలతో పలుచోట్ల ధాన్యం తడిసింది. పలుమార్లు తడ వడంతో గిం జలు మొల కెత్తాయి. నాణ్యత దెబ్బ తినడంతో ధర తగ్గిస్తారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. గురువారం నాటి భారీ వర్షానికి పట్టాలు కప్పినప్పటికీ ధాన్యం బస్తాల కిందకు నీరు చేరి తడిసిముద్దవడంతో రైతులు కంటనీరు పెడుతున్నారు.
రెండు జిల్లాల్లో వర్షం భిన్నం...
వర్షంతో తొలకరి పనులను ముమ్మరంగా మొదలుపెట్టారు. ఖమ్మం జిల్లావ్యాప్తంగా 248 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా తిరుమలాయపాలెం మండలంలో 42.4 మి.మీ వర్షం కురిసింది. ఖమ్మం అర్బన్‌లో 40.2 మి.మీ వర్షం కురవగా ఏడెనమిది మండలాల్లో స్వల్ప వర్షపాతమే నమోదైంది. ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు రోడ్డెక్కాయి. మోకాళ్లలోతు నీటిలో నగర ప్రజలు ఇబ్బంది పడ్డారు. లాక్డౌన్ నేపథ్యంలో ఉదయాన్నే అన్ని పనులు చక్కబెట్టుకోవాలని వర్షం వెలవడంతో రోడ్డెక్కిన జనం మురికినీటితో ఇబ్బంది పడ్డారు. మయూరిసెంటర్, పాతబస్టాండ్ తదితర ప్రాంతాలు మురికినీటితో నిండిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సాధారణ వర్షపాతమే నమోదైంది. ఈ జిల్లా వ్యాప్తంగా 64.6 మి.మీటర్ల వర్షపాతం నమోదవ్వగా అత్యధికంగా గుండాలలో గుండాలలో 25.6, ఇల్లెందులో 23 మి.మీ వర్షం కురిసింది. కొన్ని మండలాల్లో స్వల్ప వర్షపాతం నమోదవ్వగా మరికొన్ని మండలాల్లో వాన కురవలేదు.