Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మాచర్ల భారతి ప్ల కార్డులతో నిరసన
నవతెలంగాణ-ఖమ్మం
కరోనాను ఎదుర్కోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం అయ్యాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మాచర్ల భారతి విమర్శించారు. గురువారం పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా ఆఫీస్ వద్ద జిల్లా కమిటీ సభ్యులు విక్రం అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కరోనా కేసులు విపరీతంగా పెరిగి ఆక్సిజన్ దొరకక ప్రజల ప్రాణాలు పోతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని ఆమె అన్నారు. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని ప్రభుత్వం ప్రకటిస్తు న్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని విమర్శించారు. కరోనా వ్యాక్సిన్ కేంద్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ విషయంలో సుప్రీంకోర్టు అనేక లోటుపాట్లను గుర్తించి కేంద్ర ప్రభుత్వం దష్టికి తెచ్చి, చీవాట్లు పెట్టినా, వాటిని అమలు చేయడంలో ప్రధానంగా లోపం కనిపిస్తుందని, దీనివలన పేద, మధ్య తరగతి ప్రజలు వ్యాక్సిన్ దొరకక నానా అవస్థలు పడుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న దష్ట్యా ప్రత్యేక కరోనా హాస్పిటల్ ప్రారంభించాలని, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచితంగా వైద్యం అందించాలని, జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని కోరారు. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు సత్వరమే ఎక్స్‌గ్రేషియో ప్రకటించి చెల్లించాలన్నారు.ఖమ్మం జిల్లాకు మెడికల్ కాలేజీ ఇస్తామని గత ఎన్నికల్లో వాగ్దానం చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు నెరవేర్చలేదని విమర్శించారు. వెంటనే జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బండి పద్మ, జిల్లా నాయకులు ప్రకాష్, బషీర్, ఎండీ గౌస్, నర్రా రమేష్, మేకల నాగేశ్వరరావు, మాచర్ల గోపాల్, కాంపాటి వెంకన్న, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.