Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు నెలలకు సరిపోను నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచాలి
- గోదావరి వరదల ముందస్తు సమీక్షా సమావేశంలో కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-భద్రాచలం
గోదావరి వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గ్రామస్థాయి నుంచి జిల్లా కలెక్టర్ వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి సేవలందించాలని కలెక్టర్ అనుదీప్ పేర్కొన్నారు. గురువారం భద్రాచలంలోని సబ్ కలెక్టరేట్లో జరిగిన గోదావరి వరదలు ముందస్తు జిల్లాస్థాయి, అధికారులు సమీక్షా సమావేశంలో కలెక్టర్ అనుదీప్ పాల్గొని మాట్లాడారు. వరదలను ఎదుర్కొనేందుకు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అధికారులు సమగ్ర ప్రణాళికలు, ముందస్తు ఫ్లడ్ మేనేజ్మెంటును తయారు చేయాలని ఆదేశించారు. వరద ముంపు గ్రామాలను ముందస్తుగానే గుర్తించి ఆయా ప్రాంతాలు ప్రజలను రక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ముంపునకు గురయ్యే వరకు వేచి ఉండకుండా ముందస్తుగానే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అన్నారు. వరదల్లో చిక్కుకున్న లైఫ్ జాకెట్లు, గజ ఈతగాళ్లు, నాటు పడవలు, బోట్లు సిద్ధంగా ఉంచాలని అన్నారు. రానున్న నాలుగు నెలల వరకు సరిపోను నిత్యావసర వస్తువులు స్టాకులో ఉంచాలని జిల్లా పౌర సరఫరాల అధికారిని ఆదేశించారు. వరద ముంపును సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సెక్టోరియల్, జోనల్ అధికారులను నియమించనున్నట్టు తెలిపారు. విద్యుత్తు అంతరాయం లేకుండా పంచాయతీరాజ్, విద్యుత్తు శాఖ అధికారులు ముందస్తుగానే పరిశీలన చేయా లని, ముంపునకు గురయ్యే అవకాశాలున్న ప్రాంతా ల్లో రక్షణ చర్యలు చేపట్టి విద్యుత్తు అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు.
అత్యవసర సేవలకు హెలికాప్టర్ వినియోగించడానికి అనుగు ణంగా హెలిప్యాట్లు ఏర్పాటు చేయాలని రోడ్లు భవనాల శాఖ అధికారులకు సూచించారు. వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు వ్యవసా య, ఉద్యానవన అధికారులు టీంలను. ఏర్పాటు చేసి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. అత్యవసర సేవల కోసం మొబైల్ సెట్లు వినియో గించేందుకు సెట్లు అందుబాటులో ఉంచాలని అన్నారు. మేడిగడ్డ నుంచి సమాచారం తీసుకుని. ఎప్పటికప్పుడు ప్రజలను అప్రతమత్తం చేస్తుండాలని అన్నారు. ముంపుపై ముందస్తుగానే ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి తీర్మానాలు తీసుకోవాలని అన్నారు. సబ్జెకలెక్టరేట్లో 24 గంటలు పని చేసే కంట్రోల్ రూముతో పాటు మండల, జిల్లాస్థాయిలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని తెలిపారు.
వరదల సమయంలో గర్భిణీ మహిళలు ఇబ్బందులు పడకుండా ముందస్తుగానే జాబితాను సిద్ధం చేసి సమీపంలోని ఆసుపత్రుల్లో చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని వివరించారు. వర్షాకాలంలో పశువులు వ్యాధులకు గురికాకుండా టీకాలు వేసే కార్యక్రమాలన్ని చేపట్టాలని పశుసంవర్ధక అధికారులను ఆదేశించారు.
గొత్తికోయ ఆవాసాల్లో పర్యటించి ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టాలని, లో లైయింగ్ ఏరియాల్లో నీటి నిల్వలు లేకుండా డ్రెయిన్లు పరిశుభ్రపరచడం, డ్రెయిన్లు నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కోరారు. విస్తా కాంప్లెక్సు, అశోకనగర్ కాలనీ ప్రాంతాల్లో నీటిని ఎత్తిపోసేందుకు మోటార్లను అందుబాటులో ఉంచాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టరు వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఎస్ఈ వెంకటేశ్వరరెడ్డి, వైద్యాధికారి శిరీష, డీపీవో రమాకాంత్, జడ్పీ సీఈవో విద్యాలత, డీఆర్డీవో మధుసూదన్ రాజు పాల్గొన్నారు.