Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏరియా ఆసుపత్రి కేంద్రంగా.. అంబులెన్స్‌ల దందా
- సిండికేట్లగా మారి దోచుకుంటున్న అంబులెన్స్ నిర్వాహకులు
- చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్న అధికారగణం
- పోలీసు, రవాణాశాఖ అధికారులకు ఇది పట్టదా ..?
నవతెలంగాణ-భద్రాచలం
అసలే కరోనా కాలం...అంతుచిక్కని వ్యాధికి మందు మార్పులేని వ్యాధితో ఆసుపత్రి పాలైన రోగులనూ నిలువు దోపిడీ చేస్తూ దోచుకుంటున్నారు. నాలుగు రాష్ట్రాలకు మూల కేంద్రంగా నిలిచిన భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కేంద్రంగా ఇక్కడ ఉన్న అంబులెన్సు యజమానులు, నిర్వాహకులు సిండికేట్లగా మారి ఆసుపత్రికి వచ్చే రోగులను జలగల్లాగా పీక్కొని దోచుకుంటున్నారనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి చత్తీస్‌గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వివిధ ప్రాంతాలకు చెందిన రోగులు ఈ ఆసుపత్రికి నిత్యం వస్తుంటారు. ఈ ఆసుపత్రిలో వైద్యం లేని వాటికోసం ఇతర భద్రాచలంలోని ప్రైవేటు ఆస్పత్రిలోకి వెళ్లాలంటే అంబులెన్సుల సహాయం తప్పనిసరి. ఈ ఆస్పత్రి నుంచి భద్రాచలంలోని ప్రైవేట్ ఆస్పత్రులు కేవలం రెండు కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి. ఈ ప్రభుత్వ ఆసుపత్రి నుండి ప్రైవేటు ఆసుపత్రులకు సంబంధిత రోగిని ప్రైవేటు అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించాలంటే రూ.2000 నుంచి రూ.3000 దాకా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. అయితే ప్రైవేటు ఆస్పత్రిలోని అంబులెన్స్ తీసుకొని వచ్చి ఈ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నుంచి రోగిని తరలించాలంటే ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రైవేట్ అంబులెన్స్ యూనియన్ తగులుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇదే క్రమంలో ఇక్కడ ప్రైవేటు అంబులెన్స్‌లకు ప్రవేశం లేదనే మాదిరిగా ఏరియా ఆసుపత్రి వద్ధ ఉన్న అంబులెన్స్ నిర్వాహకులు బెదిరింపులకు పాల్పడుతున్నారనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి.
అడిగింది ఇవ్వాల్సిందే...
భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్యం కోసం వచ్చిన రోగులు ఇక్కడ లేని వైద్యం కోసం భద్రాచలం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి మరల రావాలంటే ఆర్థికంగా భారం పడుతుందని పేర్కొంటున్నారు. ఇదే సమయంలో మధ్యాహ్నం రెండు గంటలు దాటితే ఏరియా ఆసుపత్రి సమీపంలో ఒక్క ఆటో కూడా లేకపోవడంతో, ఇక్కడే ఉన్నటువంటి అంబులెన్స్ నిర్వాహకులు చెప్పిందే వేదంగా..పలికిందే ధరగా మారిందనే ఆరోపణలున్నాయి. ఇదేమని ప్రశ్నించే రోగులకు, రోగుల బంధువులకు చుక్కలు చూపించే పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఆస్పత్రి సమీపంలో తిష్టవేసి కూర్చున్న ఈ ప్రైవేటు అంబులెన్సులు యజమానులు, నిర్వాహకులు ఏడుగురు సిండికేట్‌గా మారి, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రోగులను అధిక ధరలతో దోచుకుంటున్నారని ఆరోపణలున్నాయి.
సిండికేట్‌గా మారిన ఈ అంబులెన్స్ నిర్వాహకులు, యజమానుల వెనుక ఆస్పత్రిలోని కొందరు వైద్యాధికారుల పాత్ర బలంగా ఉండటం వల్లే ఈ తరహా దందాకు పాల్పడుతున్నారని విమర్శలు వినబడుతున్నాయి. ఇక భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో కరోనాతో ఎవరైనా మృతి చెందితే ఆ మృతదేహాన్ని తరలించాలంటే బతికున్న వారికి నరకం కనబడుతుందని వ్యాఖ్యలు వినబడుతు న్నాయి. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కరోనా మృతదేహాన్ని స్మశాన వాటికకు తరలించాలంటే రూ.ఐదు వేల నుంచి ఆరు వేల వరకు డిమాండ్ చేసి మరీ తీసుకుంటున్నారు.