Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బోనకల్
తూటికుంట్లలో మే 29న జరిగిన యువకుని హత్య పథకం ప్రకారమే చేశారని వైరా ఏసిపి కే. సత్యనారాయణ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసి విలేకర్ల సమావేశంలో వైరా ఏసిపి సత్యనారాయణ వివరాలను వెల్లడించారు. తూటికుంట్ల గ్రామానికి చెందిన కొడిమెల ఉపేంద్రరావు అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో మూడేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తు న్నాడు. దీంతో వివాహేతర మహిళ కుమారుడు పలుమార్లు ఉపేంద్ర రావుని హెచ్చరించాడు. అయినా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఉపేంద్రరావు ని హత్య చేయటానికి నిర్ణయించుకున్నాడు. తన మిత్రులతో ఇదే విషయం వివరించడంతో వాళ్లు కూడా హత్యకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. వివాహేతర మహిళ కుమారుడు తన మిత్రులతో కలిసి సంగెపు విక్రమ్ ఇంట్లో ఎప్పుడు కలిసి ఉంటూ రాత్రి సమయంలో కూడా అక్కడే పడుకుంటున్నారు. ఈ సమయంలోనే వారం రోజుల క్రితం ఉపేంద్ర రావుని ఎలా చంపాలి అనే పథకాన్ని రూపొందించుకున్నారు. ఆ పథకం ప్రకారమే కొడిమెల ఉపేంద్ర రావు తన ఇంటి డాబా పైన నిద్ర పోతున్న సమయాన్ని అదునుగా భావించిన వివాహేతర మహిళ కుమారుడు మరో ఐదుగురు కలిసి మే 29 రాత్రి మూడు గంటల సమయంలో ఉపేంద్ర రావుని హత్య చేశారు. హత్య అనంతరం ఆరుగురు పరారయ్యారు. మృతుని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఏసీపీ తెలిపారు.. ఆరుగురిలో గరిడేపల్లి నాగరాజు, సంగేపు విక్రమ్ మేజర్లు కాగా మిగిలిన నలుగురు మైనర్లు అని తెలిపారు. హత్యకు ఉపయోగించిన గొడ్డలిని , సెల్ ఫోన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. మేజర్లను మధిర కోర్టులో, మైనర్ లను ఖమ్మం కోర్టులో హాజరు పరిచినట్లు ఆయన తెలిపారు. సమావేశంలో సిఐ ఒడ్డేపల్లి మురళి, ఎస్ఐ బలుగూరి కొండలరావు ఉన్నారు.