Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-కొత్తగూడెం
కరోనా ముసుగులో ప్రయివేట్ హాస్పిటల్ ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని హెచ్ఆర్టీసీ టెస్ట్ హాస్పిటల్‌కి ఓ రేటు నిర్ణయించి ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చుకుంటున్నారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం కోవిడ్ హెల్ప్ లైన్ భాద్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం కరోనా వైద్య సేవలకు ఎంత ఫీజులు వసూలు చేయాలి అనే నిబంధనలు పెట్టినప్పటికీ ప్రయివేట్ హాస్పిటల్ మాత్రం ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ప్రజల అవసరాన్ని సొమ్ము చేసుకుంటూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయని ఆరోపించారు. కరోనా రోగులకు వైద్యం పేరుతో రోజుకి రూ.40 వేల నుండి రూ.50 వేలు వసూలు చేస్తున్నార న్నారు. సామాన్యుడు మధ్య తరగతి ప్రజలు ప్రయివేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం తమ ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వ పర్యవేక్షణ కూడా లేకపోవడం వలన అడ్డ గోలుగా మెడికల్ బిల్లులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ప్రయివేట్ హాస్పిటల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని, ప్రభుత్వ పక్కా పర్యవేక్షణలో ప్రయివేట్ హాస్పిటల్ నడిచేవిధంగా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ నిభందనలకు విరుద్ధంగా వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్న ప్రయివేట్ హాస్పిటల్ గుర్తింపు రద్దు చేయాలని, హెచ్ఆర్టీసి స్కానింగ్ రేట్లు కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కొత్తగూడెం పట్టణంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కాకుండా కొన్ని వార్డులకు కలిపి ఒక చోట కోవిడ్ టెస్ట్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మచ్చా వేంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు జాటోత్ కృష్ణ, లిక్కి బాలరాజు, పట్టణ కార్యదర్శి భూక్యా రమేష్‌లు తదితరులు పాల్గొన్నారు.