Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరుగుతున్న కరోనా మరణాలు
- ఒకే రోజు 129 కేసులు నమోదు
నవతెలంగాణ-కారేపల్లి
కారేపల్లి మండలంలో కరోనా ఉదృతం ఆగటం లేదు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతునే ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా పరీక్షలను పరిమితంగా చేసిన అధికారులు, ప్రస్తుతం కేసులు అధికంగా నమోదు అవుతున్న గ్రామాల్లో నిర్వహిస్తుండటంతో చేస్తుండటంతో మరిన్ని కరోనా కేసులు బయటపడుతున్నాయి. శుక్రవారం ఒకే రోజు 129 పాజిటీవ్ కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందారు. పది రోజుల వ్యవధిలోనే 10 మంది గిరిజనులు మృత్యువాతపడ్డారంటే పరిస్ధితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరణాలు ఎక్కువగా ఆదివాసీ గ్రామాల్లోనే సంబవించటం చూస్తుంటే వారికి కరోనాపై అవగాహన లేకుండా పోయినట్లుంది. శుక్రవారం గుంపెళ్ళగూడెంలో మృతి చెందిన ఉండం కోటమ్మ ఐదు రోజులుగా జ్వరం, ఆయాసంతో బాధపడింది. ఎండకు వస్తున్న జ్వరంగా భావించింది. గ్రామంలో కరోనా పరీక్షలు చేస్తున్నారని తెలిసి కోటమ్మ పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటీవ్‌గా తేలింది. అప్పటికే పరిస్ధితి విషమించి ప్రాణాలు కోల్పోయింది. ముందస్తుగా గ్రామాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తే ఈ పరిస్ధితి వచ్చేది కాదు. బాధితులకు సకాలంలో వైద్యం అంది చాలా వరకు ప్రాణాలు దక్కేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐసోలేషన్ కేంద్రాల్లో కూడా ప్రతి ఒక్కరికి బీపీ, షుగర్, ఆక్సిజన్ లెవెల్స్ ను వైద్యాధికారులు పరీక్షించాలి. పైకి ఆరోగ్యంగా కనపడినా బీపీ, షుగర్, ఆక్సిజన్ లెవెల్స్ పడి పోతు న్నాయి. గాంధీనగర్ ఐసోలేషన్ కేంద్రంలో ఆలాంటిదే జరిగి కరపటి మల్లికార్జున్ మృతి చెందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వేడుకలతోనే కరోనా వ్యాప్తి
మండలంలో ఇంతా కరోనా వ్యాప్తికి విచ్చల విడిగా వేడుకలు జరపటమే కారణంగా కనిపిస్తుంది. వేడుకలు జరిగిన గ్రామాల్లో అధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. వేడుకలకు హాజరైనవారు కోవిడ్ బారిన పడుతు న్నారు. కొమ్ముగూడెం, గుట్టకింది గుంపు. నానునగర్‌తండా, భాగ్యనగర్‌తండా, గేటు రేలకాయలపల్లి, గుంపెళ్ళగూడెం పంచాయతీలలో జరిగిన వేడుకల మూలంగానే కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి. క్షేత్ర స్ధాయిలో వేడుకలపై పర్యవేక్షణ కొరవటం మూలంగానే ఈ పరిస్ధితి వచ్చింది. ఇప్పటికైనా అధికారులు కోవిడ్ నియంత్రణలోకి వచ్చే వరకు క్షేత్రస్ధాయిలో వేడుకలపై నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.