Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫలించిన ఎమ్మెల్యే కృషి
- పెద్దపల్లి, నల్లగొండ, కరీంనగర్ మిల్లులకు తరలుతున్న ధాన్యం
- హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
నవతెలంగాణ- సత్తుపల్లి
ఆయనో పని మాంత్రికుడు... ఏ పనైనా చేసి తీరాలంటే రాజధానిలోనే తిష్టవేసి కార్యసాధన అయ్యేంత వరకు ఎక్కడ మీట నొక్కాలో అక్కడికే వెళ్లి మరీ పని అయ్యేంత వరకు పట్టు వదలని విక్రమార్కుడిలా అసాధ్యాలను సుసాధ్యం చేయడం ఆయనకే సొంతం... ఆయనే సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య. జిల్లాలో కొనుగోలు అయిన ధాన్యంలో 60శాతానికి పైగా సత్తుపల్లి నియోజకవర్గం నుంచే కొనుగోలు చేయించడమే గాక ఇంకా మిగిలిన ఉన్న 30 నుంచి 40శాతం వరకు ధాన్యం కల్లాల్లో పేరుకుపోయి ఉన్న నిల్వలను ఎలాగైనా కొనుగోలు చేయించాలనే పట్టుదలతో గత రెండు రోజులుగా హైదరాబాద్‌లోనే మాకాం వేసి మరీ ధాన్యం రవాణాను షురూ చేయించారు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య. వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే సండ్ర కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని పెద్దపల్లి మిల్లులకు తరలించాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ మంత్రితో పాటు పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను సైతం కలిసి ధాన్యాన్ని పెద్దపల్లి మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. దీంతో పాటు శుక్రవారం సివిల్ సప్లయీస్ కమిషనర్ అనిల్‌కుమార్‌ను కలిసి నియోజకవర్గంలో మిగిలి ఉన్న ధాన్యం నిల్వలపై చర్చించారు. ఇందుకు స్పందించిన కమిషనర్ పెద్దపల్లి, నల్గొండ, కరీంనగర్ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి ధాన్యాన్ని దిగుమతి చేసుకునేలా మిల్లర్లను ఒప్పించాలని ఆదేశించడంతో ఆయా జిల్లాల కలెక్టర్లు మిల్లర్లతో మాట్లాడి ఒప్పించారు. సత్తుపల్లి నియోజకవర్గం నుంచి తీసుకొచ్చే ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలని కలెక్టర్లు కోరడంతో శుక్రవారం సాయంత్రం నుంచే కల్లాల్లో ఉన్న ధాన్యం లారీలకు లోడు అవడం ప్రారంభమైంది. నియోజకవర్గంలో 30వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రవాణాకు లారీల కొరత లేకుండా రవాణా మంత్రి పువ్వాడ అజరుకుమార్‌ను కోరగా మంత్రి పువ్వాడ ఆర్టీవో అధికారులు, కలెక్టర్, లారీ అసోసియేషన్లతోనూ మాట్లాడి ధాన్యం రవాణాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని ఎమ్మెల్యే సండ్ర తెలిపారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించనున్న నేపధ్యంలో ధాన్యానికి తీవ్ర నష్టం జరుగుతుందనే క్రమంలో ఎమ్మెల్యే సండ్ర మంత్రులు, కమిషనర్లు, అధికారులను కలిసి రవాణా ధాన్యం రవాణాకు గ్రీన్ సిగల్ ఇప్పించారు. దీంతో నియోజకవర్గంలోని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.