Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ పనులు నిల్ ఉపాధి పనులు ఫుల్
కడుపు మాడ్చుకొని ప్రతిరోజు చనిపోయే కంటే కడుపు నింపుకుంటూ ఒకేరోజు చనిపోవటం మంచిదని అనేక మంది ఉపాధి హామీ కూలీలు తమ ఆవేదన ఆక్రందన వ్యక్తం చేశారు. మండలంలో వ్యవసాయ పనులు పూర్తిగా లేకపోవటంతో కూలీలు మరోమార్గం లేక ఉపాధి హామీ చట్టం పనుల కోసం క్యూ కడుతున్నారు. ఒక వైపు కరోనా భయం.. మరొకవైపు మండుతున్న ఎండలు.. ఇంకొకవైపు కడుపుమంట.. వెరసి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉపాధి హామీ చట్టం పనులలో గుంపులుగుంపులుగా కూలీలు పనులు చేస్తున్నారు.
నవతెలంగాణ-బోనకల్
మండల కేంద్రంతోపాటు చుట్టు పక్కల గ్రామాలలో వ్యవసాయ పనులకు పూర్తికావడం తో వ్యవసాయ కార్మికులందరూ ఉపాధి హామీ పనుల బాటపట్టారు. మండలంలోని అన్ని గ్రామాలలో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మండలంలో ఒక్కొక్క గ్రామంలో 100 నుంచి 150 మంది కూలీలు, మరికొన్ని గ్రామాల్లో రెండు వందల నుంచి 250 వరకు మరికొన్ని గ్రామాల్లో మూడు వందల నుంచి ఆ పైన ఉపాధి కూలీలు గుంపులు గుంపులుగా పని చేస్తున్నారు. మండలంలో దాదాపు అన్ని గ్రామాలలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. లాక్ డౌన్ కారణంగా అనేక మంది వ్యవసాయ కార్మికులకు పనులు లేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక కుటుంబాలు పనులు లేక కుటుంబ పోషణ భారమై నానా అవస్థలు పడుతున్నారు. ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రతిరోజు గ్రామాలలో మైక్ ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. మాస్కు ధరించాలి అనే నిబంధన ప్రజలు ఎక్కువమంది పాటిస్తున్న ప్పటికీ సామాజిక దూరం పాటించడంలో మాత్రం అందరూ విఫలమయ్యారు. మండలం లోని అనేక గ్రామాలలో సాగుతున్న ఉపాధి హామీ పనుల వద్ద కూలీలు గుంపులు గుంపులుగా ఉంటున్నారు. ఈ విధంగా గుంపులు గుంపులుగా కూలీలు పనులు చేస్తుంటే కరోనా వ్యాధి రాకుండా ఎలా ఉంటుందని వాళ్లకు వాళ్లే చర్చించుకుంటున్నారు. మండల కేంద్రంలో లాక్ డౌన్ నిబంధనలు అమలు జరుగుతు న్నప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో మాత్రం లాక్ డౌన్ నిబంధనలు ఏమాత్రం అమలుకు నోచుకోవడం లేదు. కరోనా తో మండలంలో నేటికీ 36 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఆయా గ్రామాలలో చాలా వరకు ప్రజల నుంచి కరోనా భయం బయలుదేరింది. మండలంలో ఉపాధి పనుల కారణంగానే కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగి పోతున్నా యని మండల ప్రాథమికంగా వైద్య సిబ్బంది ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. పని ప్రదేశంలో కూలీలు గుంపులు గుంపులుగా ఉండొద్దని ఆయా గ్రామాల సర్పంచులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ ఎటువంటి ఉపయోగం కనిపించడంలేదు. ఉపాధి ప్రదేశం వద్ద కూలీలను కరోనా గురించి ప్రశ్నించగా వాళ్ళు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. మా అందరికీ కరోనా భయం ఉంది. ఎప్పుడు ఏమి జరుగుతుందో అని ఆందోళన చెందుతూనే ఉన్నాం. కానీ పొట్టకూటి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉపాధి పనులకు వెళ్తున్నాం. ఉపాధి పనులకు వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటాం, లాక్ డౌన్ ప్రకటించిన ప్రభుత్వం మమ్ములను ఆదుకుంటుందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఆదుకోదు, పొట్టకూటి కోసం పనులకు వెళ్లకుండా ఇంటిలోనే ఉంటాము, కూడు లేకుండా ఎన్ని రోజులు బ్రతకగలం అని ప్రశ్నించారు. కూడు లేకుండా కష్టాలతో బ్రతుకుతూ చావడం కంటే పొట్ట నింపుకుంటూ హాయిగా చనిపోయిన ఒకటే నంటూ కూలీలు ఆవేదనతో కన్నీరు పెడుతూనే పెట్ట లేనట్లుగా విధంగా సమాధానం చెప్పటం విశేషం. ఈ విధంగా కూలీలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవచ్ఛవంలా జీవనం సాగిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి లాక్ డౌన్ కాలంలో కేరళ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాన్ని మన రాష్ట్రంలో కూడా అమలు చేసి ఆదుకోవాలని వ్యవసాయ కార్మికులు ముక్త కంఠంతో కోరుతున్నారు.