Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి పల్లా కొండల రావు
నవతెలంగాణ-బోనకల్
కోవిడ్ కష్టకాలంలో ప్రజలకు సేవ చేయడంలో సత్తా చాటుతున్న కమ్యూనిస్టులు అభినందనీయులని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యుజేఎఫ్) ఖమ్మం జిల్లా కార్యదర్శి పల్లా కొండల రావు అన్నారు. బోనకల్ మండలం ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో కోవిడ్ టెస్ట్ కోసం వచ్చిన వారికి, వ్యాక్సినేషన్ కోసం వచ్చిన వారికి ప్రతిరోజు బోనకల్లో సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో అల్పాహారం ఏర్పాటు చేస్తున్నారు. ఐదవరోజు ఆదివారం ఉదయం అల్పాహార కార్యక్రమాన్ని పల్లా కొండల రావు టీడబ్ల్యూజెఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు తేనె వెంకటేశ్వర్లు ప్రారంభించారు. మండల పరిధిలోని చొప్పకట్లపాలెం గ్రామానికి చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు సీపీఐ(ఎం) తొలితరం సీనియర్ నాయకులు అమరజీవి బొప్పాల సీతారామయ్య వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు బొప్పాల అజరు కుమార్ ఆర్థిక సహకారంతో ఈ అల్పాహార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొండలరావు మాట్లాడుతూ సీతారామయ్య వర్ధంతి సందర్భంగా ఆర్థిక సహకారం అందించడం మంచి సాంప్రదాయమన్నారు. ప్రజలు కష్టకాలంలో ఉన్న ఇలాంటి సందర్భాలలో మాత్రమే కాకుండా పుట్టిన రోజులు, పెళ్లిళ్లు, వివిధ ఫంక్షన్ ల పేరుతో ఖర్చు చేసే మొత్తాన్ని ఇటువంటి సేవా, స్పూర్తి దాయక కార్యక్రమాలకు వినియోగించడం మంచి సంప్రదాయం అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ ను ఎదుర్కోవడంలో పెట్టుబడి దారీ వ్యవస్థలు విఫలం అవుతుంటే కమ్యూనిస్టు పార్టీలు అధికారంలో ఉన్న చోట ప్రభుత్వాలు, అధికారంలో లేని చోట ఆ పార్టీ కార్యకర్తలు ప్రాణాలకు తెగించి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండడం అభినందించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, మండల కమిటీ సభ్యులు కిలారి సురేష్, సీపీఐ(ఎం) బోనకల్ గ్రామ కమిటీ కార్యదర్శి తెల్లాకుల శ్రీనివాసరావు, బోనకల్ మాజీ సర్పంచ్ భూక్యా జాలు, చొప్పకట్లపాలెం సీపీఐ(ఎం) శాఖ కార్యదర్శి చలమల హరి కిషన్ రావు, మాజీ ఉప సర్పంచ్ బోయినపల్లి పున్నయ్య, కేవీపీఎస్ నాయకులు ఏసు పోగు బాబు తదితరులు పాల్గొన్నారు.