Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండిపోతున్న నిత్యావసరాలు
- కరోనాతో జీవనాధారానికి గండి
- సతమతమవుతున్న సగటుజీవి
నవతెలంగాణ-అశ్వాపురం
కరోనా మహమ్మారి ప్రవేశంతో సామాన్యుడి పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. రెక్కాడితే గాని డొక్కాడని పేదోడి బతుకులు భారంగా మారాయి. రోజురోజుకు మార్కెట్లో పెరుగుతున్న ధరలకు సామాన్యుడు చేతులెత్తేస్తున్నాడు. ఉప్పు, పప్పు నుండి ఉల్లిగడ్డల వరకు ధరలు కొండెక్కి కూర్చున్నాయి. నిత్యావసరాల ధరలు రోజురోజుకు చుక్కలు చూపిస్తున్నాయి. పెరిగిన ధరలతో సామాన్యుడి జీవితం అతలాకుతలం అవుతోంది. పప్పన్నం దొరకక పచ్చిపులుసుతోనే జీవనం సాగిస్తున్న కుటుంబాలు అనేకం ఉంటున్నాయి.
దినసరి కూలీలపై కరోనా పిడుగు
గ్రామీణ ప్రాంతాలలో అధికంగా దినసరి కూలీపనులపైనే ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు కోకొల్లలుగా ఉన్నాయి. కరోనా, లాక్డౌన్ వలన రోజువారి కూలీల బతుకులపై పిడిగుపడినట్లు అయ్యింది. కరోనా, లాక్డౌన్తో అనేక అభివృద్ధి పనులకు లాక్పడింది. దీంతో దినసరి బతుకులపై ఈ ప్రభావం బాగపడింది. ఏరోజుకారోజు కూలీపనిచేసుకుంటూ కుటుంబాలను వెళ్ళదీసుకునేవారి పరిస్థితి రోజు కూలీ పనులు దొరకక మరింత దీనంగా మారి పూటగడవని పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఆకాశాన్ని అంటిన వంటనూనే ధరలు
మార్కెట్లో వంటనూనే ధరలు సామాన్యుడికి అందనంత దూరంగా వెళ్ళాయి. గడిసిన ఏడాది కరోనా సమయంతో పోల్చుకుంటే సుమారు సగానికి సంగం రేట్లు పెరిగి పేదోడిపొయిలో పోపుపెట్టే పరిస్థితిలేకుండా తయారైంది. చివరకు పప్పునీళ్ళ చారైన చేసుకుందామంటే అపరాల ధరలు ఆకాశాన్ని అంటాయి. కంది పప్పు కొందమాంటే కళ్ళెంట నీల్లోస్తున్నాయి. చింతపండు ధర నూరు రూపాయలు దాటిపోబట్టే, చక్కెర ధర చుక్కలు చూపిస్తుంటే పామాయిల్ ధర వందకు చేరి నిరుపేదకు నిద్రలేకుండా మారిన తీరు ఇప్పుడు మార్కెట్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఇక కూరగాయల పరిస్థితి చెప్పనక్కర్లేనంతగా పెరిగిపోయాయి.
ధరలను అదుపు చేయాలంటున్న నిరుపేద జనం
కరోనా పేరుతో విచ్చల విడిగా పెరిగిన నిత్యావసరాలైన ఉప్పు, పప్పు, నూనేల ధనలను ప్రభుత్వం వెంటనే నియంత్రించాలని నిరుపేద ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మార్కెట్ల నిర్వహణపై అధికారుల నిఘా లేకపోవడంతో ధరాఘాతంతో సామాన్యుడు సతమతమవుతున్నాడని ప్రజలు వాపోతున్నారు. ఓ పక్కన విపత్తులతో ప్రజలు అల్లాడుతుంటే నిత్యావసరాలపై అధిక ధరల భారం ఎంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజలపై అధిక భారాన్ని వేసే అధికలను వెంటనే నిలువరించి ధరలను సామాన్యుడికి చేరువలోకి తీసుకు రావాలని ప్రజలు కోరుతున్నారు.