Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్ కష్టకాలంలో సామాజిక సేవలు
- ఐసోలేషన్ సెంటర్లకు తోడ్పాటు
- కరోనాతో మృతిచెందిన టీచర్ల ఫ్యామిలీలకు చేయూత
- ప్రజా ఉద్యమాలలోనూ తనదైన పంథా
పాఠాలు బోధించే ఉపాధ్యాయ సమస్యలపై పోరు సల్పడమే కాదు...సామాజిక సేవలోనూ ముందే అంటోంది...ఉంటోంది... తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సంఘం (టీఎస్‌యూటీఎఫ్). ఫెడరేషన్ ఖమ్మం జిల్లా కమిటీ వివిధ అంశాల్లో ఆదర్శంగా నిలుస్తోంది. ప్రజలు కష్టకాలంలో ఉన్న ప్రతీ సందర్భంలోనూ తనదైన పంథాలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఉపాధ్యాయ సమస్యలపై పోరు సల్పుతూ...ప్రజా ఉద్యమాలకు జై కొడుతూ...విపత్కర పరిస్థితుల్లో జనానికి అండగా నిలుస్తోంది. కరోనా కష్టకాలంలో వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేపడుతూ...ఐసోలేషన్ కేంద్రాలకు ఆర్థిక చేయూతనిస్తోంది. వాలంటరీ సర్వీసులు సైతం అందిస్తోంది. ఖమ్మంలోని బోడేపూడి విజ్ఞాన కేంద్రం (బీవీకే) ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతున్న ఐసోలేషన్ సెంటర్‌కు దన్నుగా నిలుస్తున్న సంస్థల సరసన టీఎస్‌యూటీఎఫ్ సైతం నిలిచింది.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కరోనా బాధిత ఉపాధ్యాయ కుటుంబాలకు టీఎస్‌యూటీఎఫ్ భరోసాగా ఉంటుంది. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల విధుల్లో పాల్గని కరోనా బారిన పడి కల్లూరు మండలానికి చెందిన ఉపాధ్యాయుడు మాచర్ల జగదీష్ మృతిచెందారు. అతని కుటుంబానికి రూ.1.10 లక్షలు అందించేందుకు కమిటీ ఏర్పాట్లు చేసింది. ఇదే మండలానికి చెందిన ఉపాధ్యాయుడు కాసుమల్ల వెంకటేశ్వరరావు సైతం కరోనాతో మృతిచెందారు. ఆయన కుటుంబానికి రూ.1.09లక్షలు అందించింది. ఖమ్మం రూరల్ మండలానికి చెందిన సత్యవతి కుటుంబానికి రూ.లక్ష, ఎర్రుపాలెం మండలం కాంట్రాక్టు ఉద్యోగి మల్లికార్జున్‌కు చికిత్స నిమిత్తం రూ.50వేలు ఇచ్చింది.
బీవీకే ఐసోలేషన్ సెంటర్‌కు...
బీవీకే ఆధ్వర్యంలో ఖమ్మంలోని నిర్మల్ హృదరు పాఠశాలలో విజయవంతంగా కొనసాగుతున్న ఐసోలేషన్ సెంటర్‌కు టీఎస్‌యూటీఎఫ్, ఖమ్మం జిల్లా కమిటీ ఆర్థిక అండనందిస్తోంది. ఐసోలేషన్ సెంటర్ నిర్వహణకు రూ.2లక్షల నగదుతో పాటు వాటర్‌ఫిల్టర్, మూడు గీజర్లు సమకూర్చింది. రూ.13వేల విలువ చేసే బెడ్స్‌నూ యూటీఎఫ్ ఉపాధ్యాయులు, రిటైర్డ్ టీచర్లు వితరణగా ఇచ్చారు. సుమారు 40 మంది కోవిడ్ బాధితులున్న ఐసోలేషన్ సెంటర్ నిర్వహణతో పాటు నగరంలోని దాదాపు 300 మంది కరోనా బాధితులకు బీవీకే పౌష్ఠికాహారం, భోజనాలు సమకూర్చుతోంది. దీనికి కూడా యూటీఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ తనవంతుగా పండ్లు, పాలు, పెరుగును అందిస్తోంది. జిల్లా కార్యదర్శి షేక్ రంజాన్ డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ బృందంతో కలిసి వాలంటరీ సేవలందిస్తున్నారు. సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కోవిడ్ హెల్ప్‌లైన్ సెంటర్‌ను సైతం గత నెల 8వ తేదీన ప్రారంభించారు. డాక్టర్ల సూచనలు సలహాలు అందిస్తున్నారు.
కోవిడ్ బాధితులకు కొండంత సహకారం...
గతేడాది లాక్డౌన్ సందర్భంలోనూ టీఎస్‌యూటీఎఫ్ రూ.5లక్షల విలువ చేసే నిత్యావసర సరుకులు, కూరగాయలు, పండ్లు, మాస్కులు, శానిటైజర్ పంపిణీ చేసింది. 70 నిరుపేద కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.500 విలువైన నిత్యావసర వస్తువులు అందించింది. జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలోని స్కావెంజర్లు వందమందికి నిత్యావసర సరుకులు సమకూర్చింది. వలస కార్మికులకు పెనుబల్లి మండలశాఖ నిత్య అన్నదానం చేసింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా గతేడాది ఏప్రిల్ 14వ తేదీన రక్తదాన శిబిరం నిర్వహించింది. 14 మంది టీఎస్‌యూటీఎఫ్ కార్యకర్తలు రక్తదానం చేశారు. ఈ ఏడాది మేడే సందర్భంగా నిర్వహించిన శిబిరంలోనూ పది మంది రక్తదానం చేశారు. గ్రెయిన్ మార్కెట్ ప్రాంత మానసిక వికలాంగులకూ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
సమ్మెలకు సంఘీభావం
వివిధ ప్రజా ఉద్యమాలకూ టీఎస్‌యూటీఎఫ్ సంఘీభావం ప్రకటిస్తోంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉన్న సందర్భంలోనూ టీఎస్‌యూటీఎఫ్ అండగా నిలిచింది. సమ్మెకు సంఘీభావం తెలిపింది. ఆందోళన కార్యక్రమాల్లో పాల్గనడంతో పాటు కార్మికులకు రూ.లక్ష విలువైన నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. అలాగే రైతు కూలీలకు నష్టం చేసే నూతన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా వివిధ పార్టీలు నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలకూ టీఎస్‌యూటీఎఫ్ మద్దతు ఇచ్చింది. మానవహారం, దీక్షలకు సంఘీభావం తెలపడం తదితర ఆందోళన రూపాల్లో పాల్గంది. చలో ఢిల్లీ పోరాట నిధికి రూ.లక్ష వితరణగా ఇచ్చింది. ఇలా అటు సేవా కార్యక్రమాలు, ప్రజా ఉద్యమాలకు తోడ్పాటునివ్వడంలో టీఎస్‌యూటీఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ ముందంజలో ఉంటోంది.
టీఎస్‌యూటీఎఫ్ సేవల్లోనూ మేటి..
నాగమల్లేశ్వరరావు - పారుపల్లి నాగేశ్వరరావు,
టీఎస్‌యూటీఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ
అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు
టీఎస్‌యూటీఎఫ్ ఉపాధ్యాయ సమస్యలపై పోరాడటం లోనూ... ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండటంలోనూ ముందుంటుంది. కరోనా కష్టకాలంలో ఉన్న ప్రజానీకానికి అండగా గతేడాది కాలంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నిత్యావసర వస్తువుల పంపిణీ, ఐసోలేషన్ సెంటర్ల నిర్వహణ, కరోనాతో మృతిచెందిన ఉపాధ్యాయ కుటుంబాలకు చేయూత..ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం. రక్తదాన శిబిరాలు సైతం నిర్వహిస్తున్నాం. ఇలా దాతృత్వంలోనూ టీఎస్ యూటీఎఫ్ ముందంజలో ఉంటుందని చాటిచెబుతున్నాం.