Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి కాలరీస్ కార్మికుల 11వ వేతన డిమాండ్ల కరపత్రం సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం అవిష్కరించారు. కొత్తగూడెం రుద్రంపూర్ ఏరియాలోని జికే ఓసీ, పివికే-5లో 11వ వేతన ఒప్పందం కోసం 38 డిమాండ్ల కరపత్రం కొత్తగూడెం బ్రాంచి కార్యదర్శి విజయగిరి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు కార్మికుల సమక్షంలో ఆవిష్కరించి, మాట్లాడారు. 10వ వేతన ఒప్పంద కాలపరిమితి ఈ నెల 30న ముగుస్తుందన్నారు. మేరుగైన 11వ వేతన ఒప్పందం చేసుకొనుటకు సీఐటీయూ కార్మికులకు సంబంధించిన డిమాండ్లను కార్మిక వర్గం ముందు వుంచి, ఇంకా మీరు కోరుకుంటున్న డిమాండ్లను వాట్సప్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయాలని కార్మికులను కోరారు. ఈ సందర్భంగా కొన్ని డిమాండ్లను ప్రస్తావించారు. 50శాతం జీతం పెరుగుదల వుండాలని, నిత్యావసర ధరలకు అనుగుణంగా డీఏను లెక్కించాలని, అలవెన్స్‌లు లెక్కించేటప్పుడు బేసిక్ ఫ్రీజ్ చేయకూడదని, క్వార్టర్లీ బోనస్, స్పెషల్ డీఏను బేసిక్‌లో కలపాలని, ఈ విధంగా పర్మినెంట్ కార్మికుల డిమాండ్లు కాకుండా కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లు కూడా ప్రస్తావించారు. వీటిని సాధించుకునేందు ఇతర కార్మిక సంఘాల ఐక్యత కూడా అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచి నాయకులు కె.రమేష్ బాబు, ఎలగొండ శ్రీరాంమూర్తి, పి.నాగేశ్వరరావు, ఎలగొండ రఘు, బాలాజీ, గంగులు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.