Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-చండ్రుగొండ
పోడు సాగుదారుల భూముల జోలికొస్తే ఊరుకునేది లేదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. సోమవారం మండలంలో బాలికుంటపోడు సాగుదారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అనేక దశాబ్దాల తరబడి పోడు భూములలో సేద్యం చేస్తూ వేలాది మంది గిరిజన, బలహీన వర్గాల ప్రజానీకం జీవిస్తున్నారని వీరికి ముఖ్యమంత్రి కేసీఆర్ హక్కుపత్రాలు ఇస్తామని, రైతుబంధు పథకం అమలు చేస్తామంటూ గత అనేక నెలలుగా చెపుతూ వస్తున్నాడన్నారు. కానీ ఫారెస్ట్ అధికారులు నైజాం సర్కార్ మించి గిరిజనుల భూములలో పంటలను ద్వంశం చేసి మొక్కలను నాటుతున్నారని, పేదలను భూముల నుండి వెళ్ళ గొట్టాలని చూస్తున్నారని అండర్ మైన్ బొగ్గు బావుల ద్వారా బొగ్గు తీయకుండా ఓసీలకు అనుమతి ఇవ్వటంతో పర్యావరనాన్ని ధ్వంసం చేస్తున్నారన్నారు. రైల్వేల పేరుతో అడవిని నాశనం చేస్తూ నెపం పేద ప్రజలపై మోపుతున్నారని, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉంటూ పేదలను భూముల నుండి వెళ్ళగొట్టే చర్యలకు పూనుకుంటే చూస్తూ ఊరుకో మని జిల్లా వ్యాప్త ఉద్యమాలకు సిద్ధ పడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొండపల్లి శ్రీధర్, పార్టీ మండల కార్యదర్శియాసా నరేష్, పార్టీ మండల కమిటీ సభ్యులు అవలూరి రామ్ రెడ్డి, మిర్యాల మోహన్ రావు, విప్పర్ల పెద్ద వెంకటేశ్వర్లు, కేవీపీఎస్ మండల కార్యదర్శి రారు రాజా తదితరులు పాల్గొన్నారు.