Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా బాధితులకు ఆపన్న హస్తం
- కరోనా మృతదేహాలకు అంతిమ సంస్కారాలు
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలో బండారు చందర్రావు ట్రస్ట్ (బీసీఆర్) కరోనా హెల్ప్ లైన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు కరోనా బాధితులకు కొండంత అండగా నిలుస్తున్నాయి. భద్రాచలంలో కరోనా హెల్ప్ లైన్ సెంటర్‌ను మే 23న ఏర్పాటు చేశారు. సీపీఐ(ఎం)కు చెందిన రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు ఈ ట్రస్టులో సుమారు 15 మంది నాయకులు కరోనా బాధితులకు విశేష సేవలను అందిస్తు న్నారు. కరోనా రెండో విడత వైరస్ అధికంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భద్రాచలం వాసులతో పాటు ఏజెన్సీ వాసులకు ఈ ట్రస్టు సేవలను అందిస్తోంది. పినపాక, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాలలోని మండలాలతో పాటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విలీన మండలాలైన ఎటపాక, కూన వరం, వీఆర్ పురం, చింతూరు మండలాల్లో కూడా కరోనా బాధితులకు సేవలందించేందుకు ఈ ట్రస్ట్ నిలిచింది.
అన్నీ తామై.. కరోనా బాధితులకు ధైర్యాన్ని నింపుతున్న ట్రస్టు
అసలే కరోనా కాలం... కరోనా వైరస్‌తో బాధ పడుతున్న వారితో పాటు, కరోనాతో మృతి చెందిన వారికి కూడా కొండంత ధైర్యాన్ని ఈ ట్రస్ట్ నింపుతోంది. ఈ సమయంలో ట్రస్ట్‌లోని సీపీఐ(ఎం)కు చెందిన నాయకులు అన్ని తామై.. కరోనా రోగులకు సేవలు అందిస్తున్నారు. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఈ ట్రస్టు ఆధ్వర్యంలో 20 మంది కరోనా బాధితులను చేర్పించారు. అదే విధంగా సుమారు 50 మందికి వైద్యుల ద్వారా తగిన సూచనలు అందించి వారిలో ధైర్యాన్ని ఈ ట్రస్ట్ నింపుతోంది. అదేవి ధంగా బీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా పాజిటివ్ వచ్చిన బాధి తులకు ఉచితంగా భోజనాన్ని అందజేస్తున్నారు. 500 మంది కి పైగానే భోజ నాలను ఈ ట్రస్టు అంద జేసింది. కరోనా బారిన పడ్డ ఇబ్బందులు పడిన 20 కుటుంబాలకు పైగా నిత్యావసర వస్తువులను, సరుకు లు అందజేశారు. అలాగే భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో 200 మంది కరోనా బాధితులకు పండ్లను ఈ ట్రస్టు ద్వారా పంపిణీ చేశారు.
అర్ధరాత్రి సమయంలోనూ సేవా కార్యక్రమాలు
కరోనా వైరస్‌తో మృతి చెందిన కుటుంబాలకు బీసీఆర్ ట్రస్టు నిర్వాహకులు పగలు, రాత్రి అంటూ తేడా లేకుండా తమ సేవా కార్యక్రమాలలో నిమగమై పనిచేస్తున్నారు. కరోనా వైరస్‌తో మృతి చెందిన మృతదేహాలకు అంతిమ సంస్కారాలు సైతం ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వాహకులు అర్ధరా త్రి సమయంలో కూడా నిర్వహిస్తూ మేమున్నాము అంటూ.. భరోసాను, ధైర్యాన్ని ఇస్తున్నారు. కరోనాతో మృతి చెందిన ముగ్గురికి అంత్యక్రియలను నిర్వహించారు.
హెల్ప్ లైన్ కోఆర్డినేషన్ సెంటర్ టీమ్
బండారు చందర్రావు కరోనా హెల్ప్ లైన్ కోఆర్డినేషన్ సెంటర్లో 15 మంది సీపీఐ(ఎం) రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు తమ సేవలను ఈ ట్రస్టు ద్వారా అందిస్తున్నారు. ఈ మొత్తం కోఆర్డినేటర్‌గా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్, కన్వీనర్‌గా పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, మర్లపాటి రేణుక, యంబీ నర్సారెడ్డి, కె.బ్రహ్మచారి, భీమవరపు వెంకటరెడ్డి, బండారు శరత్ బాబు, వై.వెంకట రామారావు, కమిటీ సభ్యులు పి.సంతోష్ కుమార్, యన్.నాగరాజు, సున్నం గంగా, ఎస్.డి.ఫిరోజ్, కుంజా శ్రీనివాస్‌లు తమ సేవలను అందజేస్తున్నారు. ఇదే క్రమంలో ఇటీవల భద్రాచలంలో పర్యటించిన కలెక్టర్ అనుదీప్‌కు ఈ ట్రస్టు ఆధ్వర్యంలో భద్రాచలంలో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సమయంలో కలెక్టర్ సైతం సానుకూలంగా స్పందించారు.
నేడు ఐసోలేషన్ కేంద్రం ప్రారంభం
బండారు చందర్రావు ట్రస్టు ఆధ్వర్యంలో కరోనా బాధితుల కోసం ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రాన్ని మంగళవారం భద్రాచలంలో ప్రారంభించనున్నారు. భద్రాచలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కన ఉన్న ఎస్టీ బాలికల వసతి గృహంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు జిల్లా అధికారులు అనుమతులు సైతం ఇచ్చారు. ఈ ఐసోలేషన్ సెంటర్లలో ఉచిత సేవలను అందజేసేందుకు బండారు చందర్రావు ట్రస్టు నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారు. ఇందుకుగాను ముప్పై బట్టలతో ఇక్కడ విశ్లేషణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ నిపుణులైన వైద్యులు వచ్చి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కరోనా రోగులను పరీక్షించనున్నారు. ఈ ఐసోలేషన్ కేంద్రంలో శిక్షణ పొందుతున్న కరోనా బాధితులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం అందజేయనున్నట్టు ట్రస్టు నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే ఐసోలేషన్ కేంద్రంలో ఏర్పాట్లను ట్రస్టు నిర్వాహకులు పూర్తి చేశారు.