Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రజారోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో వర్షాకాలంలో అంటువ్యాధుల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలేరియా వ్యాధి జరుగుతున్న ప్రాంతాలను హాట్ స్పాట్స్ గుర్తించి ముందస్తు ఆరోగ్య శిబిరాలు నిర్వహించి వ్యాధి నియంత్రణకు చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను ఆదేశించారు. వర్షాకాలం సీజన్ ప్రారంభం అయినందున దోమలు వ్యాప్తి లేకుండా గ్రామాల్లో ఫాగింగ్ నిర్వహించడం, గిరిజన గ్రామాల ప్రజలకు దోమతెరలు పంపిణీ కార్యక్రమం చేపట్టాలని చెప్పారు. జిల్లాలోని 444 ఆవాసాల్లో గతంలో మలేరియా వ్యాధి కేసులు నమోదయ్యాయని, ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య క్యాంపులు నిర్వహించి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టాలని చెప్పారు. పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహణను ఆకస్మిక తనిఖీలు చేస్తామని తనిఖీలు అపరిశుభ్రత ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి శిరీష, డిసిహెచ్ఎస్ ముక్కంటేశ్వరావు, డిఆర్డిఓ మధుసూదన్ రాజు, డిపిఓ రమాకాంత్, మిషన్ బగీరథ ఈఈ తిరుమలేష్, మున్సిపల్ కమిషనర్లు సంపత్ కుమార్, శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్, నాగప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
మహిళలు, బాలికలు సైబర్ నేరాల బారిన పడకుండా చైతన్యం కల్గించాలి
మహిళలు, బాలికలు సైబర్ నేరాల బారిన పడకుండా గ్రామస్థాయి నుండి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో మహిళా శిశు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల పరిరక్షణ, సఖీ, దివ్యాంగుల హక్కుల పరిరక్షణ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ బాల్య వివాహాలు, బాలికలు, మహిళలపై దౌర్జన్యాలు హింస జరుగుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అత్యవసర సేవలకు 181 కంట్రోల్ రూములకు ఫోన్ చేసి సహాయతను పొందాలని ఆయన సూచించారు. ఇప్పటి వరకు సఖీ కేంద్రంలో 681 కౌన్సిలింగ్ సేవలు, 611 న్యాయ సేవలు, 3 కేసులు కోర్టు విచారణలో ఉన్నాయని, 97 వైద్య సేవలు, 51 పోలీస్ సేవలు, 121 తాత్కాలిక వసతి సేవలు, 35 సర్వైవర్ కిట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. పరస్పరం అంగీకారంతో రాజీ కుదిరిన కేసులపై 6 నెలల పాటు పర్యవేక్షణ జరగాలని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి వరలక్ష్మి, వైద్యాధికారి డాక్టర్ శిరీష, విద్యాశాఖాధికారి సోమశేఖర శర్మ, డిఆర్డిఓ మధుసూదనాజు, డిసిపిఓ హరికుమారి, కమిటి సభ్యులు పాల్గొన్నారు.