Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్ కుమార్
నవతెలంగాణ-గుండాల
ఆదివాసీల భూములపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణ కేసులు వేస్తామని తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్ కుమార్ అన్నారు. మండలంలోని మామకన్ను గ్రామంలో ఇటీవల కాలంలో అటవీశాఖ అధికారులు, ఆదివాసీలకు మధ్య జరిగిన పోడు భూమి ఘర్షణ సమస్యపై ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి కొడెం వెంకటేశ్వర్లు, హైకోర్టు అడ్వకేట్ అరెం పాపరావుల బృందం మంగళవారం మామకన్ను గ్రామాన్ని సందర్శించి ఆదివాసి రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మామకన్ను గ్రామంలో 32 కంపార్ట్ మెంట్ నెంబరులో గల భూములలో ఆదివాసీలు గత 40 ఏండ్లుగా సాగులో ఉన్నారని, అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం అర్హత కలిగి ఐటీడీఏ, ఫారెస్ట్, రెవెన్యూ శాఖల సర్వే కూడా పూర్తి అయి కొంత మందికి పట్టాలు కూడా మంజూరు అయ్యాయని తెలిపారు. కలెక్టర్ పరిధిలో సమస్య ఉందని కలెక్టర్ హైకోర్టుకి నివేదిక ఇచ్చచేంత వరకు ఆ భూములలోకి వచ్చే అధికారం అటవీశాఖకు లేదన్నారు. అరెటం లక్ష్మయ్యకు చెందిన అటవీ హక్కుల చట్టం పట్ట కలిగిన భూములలో కూడా అటవీశాఖ మొక్కలు పెట్టడం చూస్తే పార్లమెంట్ చట్టాలను కూడా అటవీ శాఖ ఏ విధంగా ఉల్లంఘన చేస్తుందో అర్దం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కోడెం రమేష్, రైతులు పాల్గొన్నారు.