Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదునుగా దుక్కులు దున్ని పత్తి విత్తుతున్న రైతులు
- మృగశిర కార్తె ప్రారంభంతో వర్షాలపైనే రైతన్నల ఆశలు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ఈ ఏడాది జూన్ ప్రారంభంలోనే కాలం చల్ల బడింది. రోహిణి కార్తెలోనే వారంలో రోజుల్లో రెండు, మూడు సార్లు తొలకరి వర్షాలు కురవడంతో మండల రైతులు సాగుకు సన్నద్దం అయ్యారు. మృగశిర కార్తె ప్రవేశంతో తొలకరి వర్షాలు సైతం కురుస్తాయని, రుతుపవనాలు సైతం రెండు మూడు రోజుల్లో ప్రవేశించనున్నాయనే వాతావరణ శాఖ అధికారులు తెలపడంతో మండల రైతులు వ్యవశాయ పనులు ముమ్మరం చేశారు.
ప్రారంభమైన వ్యవశాయ పనులు
తొలకరి వర్షాలతో మండలంలో వ్యవశాయ పనులు ప్రారంభం అయ్యాయి. జూన్ మొదటి వారంలో రెండు మూడు సార్లు కురిసి మోస్తరు వర్షాలకు భూములు సాగుకు అనూకూలంగా మారాయి. దీంతో మండల రైతులు పత్తి, మిర్చి మోడులు తీయడంతో పాటు పంట పొలాలను అదునుగా ట్రాక్టర్లు, అరకలతో దుక్కులు దున్ని సిద్దం చేశారు. గత రెండు రోజులుగా రైతులు మార్కెట్లో దొరుకుతున్న నూజివీడు సీడ్స్, 659, గోల్డ్ కాటన్, తులసి వంటి పత్తి విత్తనాలను కొనుగోలు చేస్తూ పత్తి విత్తుతూ వ్యవశాయ పనులు ముమ్మరం చేశారు. మండలంలో రైతులు అత్యధికంగా పత్తి, వరి సాగుతో పాటు మిర్చి సాగు చేస్తుంటారు. మండలంలో ఉన్న గిరిజన, గిరిజనేతర రైతులు
పత్తి సాగును ప్రతి ఏడు సుమారు 25 నుండి 30 వేల ఎకరాలలో సాగు చేస్తుంటారు. ఈ ఏడాది జూన్ ప్రారంభంలోనే వర్షాలు కురవడంతో తొలకరి వ్యవశాయ పనులతో పాటు పంట పొలాల్లో పత్తి గింజలు విత్తుతూ వ్యవశాయ పనులు ముమ్మరం చేశారనే చెప్పవచ్చు.
వర్షాలపైనే రైతన్న ఆశలు
తొలకరి వర్షాలతో అదునుగా దుక్కులు దున్ని పత్తి విత్తు తున్న మండల రైతులు తొలకరిలో కురిసే వర్షాలపైనే ఆశలు పెట్టుకుని పత్తి విత్తు తున్నారు. మృగ శిర కార్తె ప్రారంభం, రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలపడంతో పత్తి రైతులు గంపెడు ఆశలతో దొరికినకాడల్లా అప్పులు చేసి ట్రాక్టర్ల ద్వారా దుక్కులు దున్నుతూ, పత్తి విత్తనాలు కొనుగోలు చేసి పంట చేలల్లో పత్తి విత్తుతున్నారు. అదునుగా వర్షాలు కురిస్తే వేసిన ప్రతి పత్తి గింజ విత్తుకుని మొక్కలు మొలుస్తాయని చావు గింజలు వేసే పని ఉండదని పత్తి రైతులు తెలుపుతున్నారు.