Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసోలేషన్ కేంద్రంతో అద్భుత సర్వీసు
- నెలరోజుల వ్యవధిలో వందమందికి పైగా ఊరట
- సంతృప్తి వ్యక్తం చేస్తూ కొందరు విరాళాలు
- 70 మంది వరకు వాలంటరీ సేవలు
- రోజుకు 200 మందికి ఇంటికే భోజనాలు
- ఖమ్మం జిల్లా వరకు అందుబాటులో అంబులెన్స్
'ఏదో చేశామంటే చేశాం కాదు...సేవ చేయాలన్నా...పోరు సల్పాలన్నా అంకితభావం కావాలి. అదీ అణువణువునా ఉన్న బోడేపూడి విజ్ఞాన కేంద్రం (బీవీకే) కార్యకర్తలు ఖమ్మంలో దాదాపు నెలరోజులుగా ఐసోలేషన్ కేంద్రాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. దీనిలో ఐసోలేట్ అయిన వందమందికి పైగా బాధితులు కోలుకుని ఇళ్లకు వెళ్తూ...ఇక్కడి సేవలకు ముగ్ధులై 'మేము సైతం'...అంటూ సంతృప్తిగా విరాళాలు ఇస్తుండటం విశేషం.
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఇద్దరు, ముగ్గురున్న ఇల్లే పరిశుభ్రంగా ఉంచడం కష్టం. అటువంటిది 40 మంది...అది కూడా కరోనా రోగులున్న ఐసోలేషన్ కేంద్రం. ఎవరు పడితే వాళ్లు..ఎలా పడితే అలా వెళ్లడానికి వీలులేదు. ఎన్నో జాగ్రత్తలతో పనిచేస్తేనే ఇక్కడ శుచీశుభ్రత నెలకొంటుంది. కానీ బీవీకే వాలంటీర్లు, స్కావెంజర్లు, ఆయాలు, మున్సిపల్ పారిశుధ్య కార్మికులు పరస్పర సహకారంతో విధులు నిర్వహిస్తుండటంతో ఇంటికంటే శుభ్రంగా బీవీకే ఐసోలేషన్ కేంద్రం ఉంటోంది. మే 12వ తేదీన ప్రారంభమైన ఈ ఐసోలేషన్ కేంద్రం నిరంతరాయంగా 40 మంది బాధితులతో కొనసాగుతోంది. వీరి ఆలనాపాలనా చూడటంతో పాటు హౌం ఐసోలేషన్‌లో ఉన్న సుమారు 200 మందికి ఇక్కడి నుంచి పౌష్ఠికాహారం సఫ్లరు అవుతోంది. ఇవన్నీ చేయడానికి 70 మంది వరకు వాలంటీర్లు నిరంతరం శ్రమిస్తున్నారు. ప్రతీదీ ప్రణాళికబద్ధంగా చేస్తున్నారు. పనివిభజన ప్రకారం ముందుకెళ్తున్నారు. ఇక్కడి విధులను నాలుగు రకాలుగా విభజించారు. విభాగానికి ఒక్కరు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు.
1. అడ్మిషన్స్...
ఐసోలేషన్ కేంద్రం అడ్మిషన్స్ బాధ్యతలను సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేష్ పర్యవేక్షిస్తున్నారు. 94కు పైగా ఆక్సిజన్ లెవల్ ఉన్న వారిని కేంద్రంలో చేర్చుకుంటున్నారు. అడ్మిట్ అయ్యేవారిని తీసుకురావడం, కోలుకున్నవారిని పంపడం, అత్యవసర వైద్యం అవసరమైన వారిని ఆయా ఆస్పత్రులతో మాట్లాడిసంస్థ అంబులెన్స్‌లో తరలించడం వంటి విధులు నిర్వహిస్తున్నారు. ఐసోలేషన్ కేంద్రంలో వసతులు, శుభ్రతపై ఈయన ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సిస్టర్స్ విజయ, నౌశిన్, కాంపౌండర్ నాగరాజు నిరంతరం రోగుల బాగోగులు చూసుకుంటున్నారు. ఇద్దరు ఆయాలు రెండు ఫ్లోర్లలో ఆరు గదుల్లో ఉన్న 20 బెడ్ల బెడ్‌షీట్స్ రోజు విడిచి రోజు మారుస్తున్నారు. స్కావెంజర్లు బాత్రూమ్లను నిరంతరం శుభ్రంగా ఉంచుతున్నారు. రోగుల స్నానాదులకు కావాల్సిన సబ్బులు కూడా సమకూర్చుతున్నారు. మున్సిపల్ సిబ్బంది సహకారంతో ఐసోలేషన్ కేంద్రం పరిసరాలను కూడా ఎంతో శుభ్రంగా ఉంచుతుండటంతో రోగులు ఏమాత్రం అసౌకర్యానికి గురికాకుండా ఇక్కడ ఉంటున్నారు.
2. మెడికల్, వైద్యసదుపాయాలు...
మెడికల్, వైద్యసదుపాయాల బాధ్యతలను సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వర్లు పర్యవేక్షిస్తున్నారు. ఆయనకు శ్రీమన్నారాయణ సహకరిస్తున్నారు. ఐసోలేషన్‌లోని రోగులకు సకాలంలో మెడిసిన్ ఇవ్వడం, ఆక్సిజన్ సమకూర్చడం, అవసరమైన వారికి రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు ఇప్పించడం, డాక్టర్ల పర్యవేక్షణ బాధ్యతలను వీరు నిర్వహిస్తున్నారు. సుమారు పది మంది డాక్టర్లు ఇక్కడి రోగులకు వైద్యసేవలందిస్తున్నారు. డాక్టర్ యలమంచిలి రవీంద్రనాథ్ ప్రతిరోజు సాయంత్రం ఆన్లైన్ ద్వారా ప్రతి ఒకరోగి బాగోగులను తెలుసుకుంటున్నారు. డాక్టర్ చీకటి భారవి, కొల్లు అనుదీప్, గోంగూర వెంకటేశ్వర్లు, పొన్నం సుబ్బారావు, డాక్టర్ సుమంత్, ప్రభుత్వ ఆస్పత్రి ఛాతి వైద్యనిపుణులు సురేందర్ నిత్యం అందుబాటులో ఉంటూ వైద్యసేవలు అందిస్తున్నారు. ఫిజియోథెరపీ డాక్టర్ మురళి రోగుల్లో యాంటిబాడీస్‌ను పెంపొందించే యోగాసనాలు చేయిస్తున్నారు. డీఎంహెచ్‌వో మాలతి, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.వెంకటేశ్వర్లు, ఆర్ఎంవో బల్లికొండ శ్రీనివాస్ సైతం తమవంతు సహకారం అందిస్తున్నారు. కరోనా బారిన పడిన పలువురు రూ.2 లక్షల నుంచి రూ.3లక్షల వరకు ఖర్చుపెట్టితే గానీ కోలుకోని వైద్యం ఇక్కడ ఉచితంగా అందిస్తుండటం గమనార్హం. ఆయు ఆసుపత్రి ఆధ్వర్యంలో రోగుల ఆరోగ్య పరిస్థితులపై నిత్యం టెస్టులు నిర్వహిస్తున్నారు.
3. పౌష్ఠికాహారం...భోజనం...
ప్రతిరోజూ ఐసోలేషన్ సెంటర్లోని 40 మందితో పాటు హౌం ఐసోలేషన్ అయిన సుమారు 200 మందికి బీవీకే నుంచి టిఫిన్లు, భోజనం, ఫ్రూట్‌జ్యూస్‌లు, డ్రైఫ్రూట్స్, వాల్నట్స్ వంటి పౌష్ఠికాహారం అందుతోంది. ఫుడ్ సెక్షన్ బాధ్యతలను బీవీకే చైర్మన్ వై.శ్రీనివాసరావు చూస్తున్నారు. దాతల సహకారంతో ప్రతిరోజూ రూ.20వేల వరకు వెచ్చించి పౌష్ఠికాహారం సమకూర్చుతున్నారు. బీవీకే కుక్ వల్లంకొండ రాధాకృష్ణ ఆధ్వర్యంలో 8 మంది వర్కర్ల సహకారంతో రోజుకు 250 మందికి సరిపడా భోజనాలు సిద్ధం చేస్తున్నారు. ఉదయం రోజుకో రకం టిఫిన్, గుడ్డు, టీ ఇస్తున్నారు. 11 గంటలకు రాగిజావ, పండ్ల రసాలలో ఏదో ఒకటి ఇస్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజనం, వారంలో మూడు రోజులు చికెన్, నాలుగు రోజులు గుడ్డు, ఐదారు రకాల కూరలు, పెరుగుతో భోజనం పెడుతున్నారు. సాయంత్రం 4 గంటలకు స్నాక్స్, పండ్లు, విత్తనాలు, మిరియాల పౌడర్‌తో పాలు అందిస్తున్నారు. 7గంటలకు రాత్రి భోజనం, ఎగ్, పెరుగు, పలు రకాల కూరలతో పెడుతున్నారు. ఈ మెనూలో హౌం ఐసోలేషన్‌లో ఉన్నవారికి మాత్రం రెండు పూటలా భోజనం, పండ్లు సమకూర్చుతున్నారు.
4. వాలంటరీ సేవలు...
డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ఐద్వా, వ్యవసాయ కార్మికసంఘం, యూటీఎఫ్ తదితర సంఘాలకు చెందిన సుమారు 30 మంది డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్, ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి ఆధ్వర్యంలో నిరంతరం వాలంటరీ సర్వీసు అందిస్తున్నారు. మొత్తంగా 80 మంది వరకు ప్రజాసంఘాల కార్యకర్తలు ఈ సేవల్లో పాలుపంచుకుంటున్నారు. డీవైఎఫ్ఐ నాయకులు నాగరాజు, సైదారావు పూర్తిగా ఐసోలేషన్ కేంద్రంలోనే ఉంటూ రోగులతో మమేకం అవుతూ...వారిలో ధైర్యం నింపుతూ సేవలందిస్తున్నారు. హౌం ఐసోలేషన్‌లో ఉన్న పేషెంట్లకు సకాలంలో భోజనం అందిస్తున్నారు.
- దాతల సహకారం...
బీవీకే, సీపీఐ(ఎం) ప్రజాసంఘాలు నమ్మకంతో సర్వీసు అందిస్తాయనే విశ్వాసం ప్రజల్లో ఉండటంతో దాతలు వారంతట వారే ముందుకు వచ్చి ఐసోలేషన్ సెంటర్ నిర్వహణకు తోడ్పాటునందిస్తున్నారు. ఎన్ఆర్ఐ పేరెంట్స్, ఎన్ఆర్ఐ ఫౌండేషన్, యూటీఎఫ్, సత్యసాయిసేవా సమితి, తాళ్లూరి పంచాక్షరయ్య ట్రస్టు, సుబంధ ఫౌండేషన్ దాతృత్వంతో ముందుకు వచ్చాయి. దాతలు పోటీ పడి ఆహారపదార్థాలు సమకూర్చుతుండటం గమనార్హం. ఎన్ఆర్ఐ పేరెంట్స్ 50 బెడ్లు, ఈఅండ్ఈ సంస్థ 30 బెడ్లు ఇలా మొత్తం 100 బెడ్ల వరకూ సమకూర్చాయి. సుందరయ్య విజ్ఞాన కేంద్రం రెండు ఆక్సిజన్ కాన్సంట్రేషన్లు వితరణగా ఇచ్చింది. సుబంధ ఫౌండేషన్ అంబులెన్స్‌ను సమకూర్చింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కోవిడ్ బాధితుల కోసం ఈ అంబులెన్స్‌ను ఉపయోగించుకోవచ్చు. 9573691669, 94390098211 నంబర్లకు ఫోన్ చేసి అంబులెన్స్ సౌకర్యం పొందవచ్చు. ఇక్కడి సర్వీసు పట్ల ముగ్ధులై పలువురు పేషెంట్లు కోలుకున్నాక సంతృప్తితో రూ.10వేల లోపు విరాళంగా ఇస్తున్నారు.