Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విత్తనాలు, ఎరువులు సరిపడా ఉన్నాయి
- 18,768 రేషన్ కార్డుల దరఖాస్తులు
- లాక్ డౌన్‌తో కరోనా పాజిటివ్ రేటు తగ్గింది
- రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
జిల్లాలో వానాకాలం పంటసీజన్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విత్తనాలు, ఎరువులను సకాలంలో అందించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ ఆదేశించారు. టిటిడిసి సమావేశ మందిరంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్‌తో కలిసి బుధవారం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. జిల్లాలో యాసంగి ధాన్య సేకరణలో భాగంగా ఇప్పటి వరకు 3,42,792 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసామన్నారు. మిగిలిన 6,372 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ నెల 15 లోగా కొనుగోలు చేసి, మిల్లులకు తరలించాలని ఆదేశించారు. చివరి బస్తావరకు కొనుగోలు చేస్తామన్నారు. ఇంకనూ మిల్లులకు తరలించాల్సిన 39,633 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సత్వరమే తరలించాలన్నారు. ఈ నెల 15 నుండి రైతుబంధు నగదు ఖాతాలో జమవుతుందని తెలిపారు. జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయదారులపై ఉక్కుపాదం మోపాలని, ఇతర రాష్ట్రాల ధృవీకరణ పత్రాలతో నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటికే దరఖాస్తు చేసుకొన్నవారిలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డు మంజూరుకు సత్వర చర్యలు తీసుకోవాలని పౌర సరఫరా శాఖాధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు జిల్లాలో ఇప్పటికే దరఖాస్తు చేసుకొని పెండింగ్‌లో ఉన్న 18,768 దరఖాస్తులను పరిశీలించి అర్హులందరికీ రేషన్ కార్డు మంజూరుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో రైస్ మిల్లుల ఏర్పాటుకు ఔత్సాహికులైన పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మంజూరు చేసిన స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుకు ప్రభుత్వ భూమిని సేకరించి ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. జిల్లాలో సరిపడా రైస్ మిల్లులు లేకపోవడం వల్ల మన జిల్లాలో సేకరించిన ధాన్యం ఇతర జిల్లాలకు తరలిస్తున్నామన్నారు. స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు ద్వారా జిల్లాలోనే విరివిగా రైస్ మిల్లులను ఏర్పాటు చేసుకునే సౌలభ్యం కలుగుతుందన్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి ఈ రైస్ మిల్లులు అందుబాటులోకి రావాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న లాక్డౌన్ నిర్ణయం వల్ల జిల్లాలో కోవిడ్ పాజిటివ్ రేటును 33 శాతం నుండి 8 శాతానికి తగ్గించగలిగామన్నారు. ఇంటింటి జ్వర సర్వేతో కరోనాను కట్టడి చేయగలిగామన్నారు.
ధాన్యం సేకరణలో ఇబ్బందులు అధిగమించాలి: ఎంపీ నామ
మిగిలిన ధాన్యం సేకరణ, రవాణా విషయంలో ఉన్న సమస్యలను అధిగమించి రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు సూచించారు. జిల్లాలో ''కోవిడ్ సెకండ్‌వేవ్'' లాక్డౌన్ పరిస్థితులలో కూడా మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే సేకరించి మిల్లులకు తరలించామని కలెక్టర్ తెలిపారు. ఎంఎల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎంఎల్ఏ లావుడ్యా రాములునాయక్, జెడ్పీ చైర్మన్ లింగాల కమలరాజు, డి.సి.సి.బి చైర్మన్ కూరాకుల నాగభూషణం, నగర మేయర్ పునుకొల్లు నీరజ, పోలీసు కమిషనర్ విష్ణు. యస్. వారియర్, నగరపాలక సంస్థ కమిషనర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్. మధుసూదన్, సంబంధిత శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.