Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-వైరా టౌన్
కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మూలంగా దేశంలో కరోనా బారినపడి లక్షలమంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణ కోసం సమన్వయంతో పనిచేసి కరోనా విజృంభణ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. వైరా నియోజకవర్గ పరిధిలో ఇటీవల మరణించిన సిపిఐ(ఎం) నాయకులు లింగాల యోహన్, బండి పాడయ్య, బుంగ కృష్ణ, శ్రీరామనేని సత్యం, గోంగూర మురళి, ఈసం ఎల్లయ్య, రాచర్ల శ్రీనివాస్, ఎస్.కె సత్తార్, స్వర్ణ శ్రీదేవిలకు సంతాప సభ కోవిడ్ నేపథ్యంలో అన్లైన్లో సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, వైరా నియోజకవర్గ ఇన్చార్జ్ భూక్యా వీరభద్రం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ అనేక ముఖ్యమైన ప్రజా పోరాటాలలో పాల్గొనటంతోపాటు నిర్బంధాన్ని సైతం ఎదుర్కొంటు సిపిఐ(ఎం) బలోపేతానికి కృషి చేసిన నాయకుల మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని పేర్కొన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయై విజయన్ చొరవతో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రాలకు వ్యాక్సిన్ అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించిందన్నారు. సభలో సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు , జిల్లా కమిటీ సభ్యులు బొంతు రాంబాబు ప్రసంగించారు.