Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రైవేటు ఆసుపత్రుల నుండి డబ్బులు వాపస్ ఇప్పించండి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-ఖమ్మం
కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను ప్రైవేటు సంస్థలకు, కార్పొరేట్ ఆసుపత్రులకు యివ్వాలనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. అందరికీ టీకా ఉచితం అని ప్రకటించిన ప్రధాని మోదీ ప్రైవేటుకు అవకాశం కల్పించడం టీకా దోపిడీకి తెర తీయటమేనన్నారు. దీన్ని అవకాశంగా తీసుకొని ఉత్పత్తి కంపెనీలు ప్రైవేటుకే ఎక్కువ విక్రయించే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. అధిక ఫీజులు వసూలు చేసిన ప్రైవేటు హాస్పిటల్స్ నుండి డబ్బులు వాపస్ ఇప్పిస్తామని ప్రకటించిన ప్రభుత్వం దానిని వదిలి వేసిందన్నారు. ఎప్పటిలోగా యిప్పిస్తారో, వాటికి మార్గదర్శకాలేమిటో ప్రకటించాలన్నారు. 50 వేల ఆరోగ్య సిబ్బందిని నియమిస్తామని చెప్పి వారాలు గడుస్తున్నా ఆ ఊసే లేదన్నారు. అసలే చాలీ చాలని సిబ్బంది, పైగా అనేక మంది కరోనాతో విశ్రాంతిలో ఉండటంతో ఉన్న వైద్య సిబ్బందిపై పెను భారం పడుతుందని, ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని, యుద్ధ ప్రాతిపదికపై సిబ్బందిని నియమించాలన్నారు.