Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాతాశిశు సంరక్షణ కేంద్రంగా పాత భవనం
- సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపిన
ఎమ్మెల్యే సండ్ర
నవతెలంగాణ- సత్తుపల్లి
సకల సౌకర్యాలతో 100 పడకల ఆసుపత్రిని సత్తుపల్లిలో ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశం లో తీర్మానం చేశారు. ఇప్పుడున్న పాత భవనాన్ని మాతాశిశు సంరక్షణ కేంద్రంగా ఉపయోగించ నున్నారు. గత 43 ఏండ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి హయాంలో ఇక్కడ ఆసుపత్రి నిర్మాణం జరిగింది. ప్రస్తుతం శిథిలావస్థకు చేరడంతో కొత్త భవనాన్ని నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో పాటు ముఖ్యమంత్రిని కలిసిన ప్రతిసారి ఆసుపత్రి ముచ్చటను సండ్ర తీసుకురావడం జరుగుతూ వచ్చింది. ఇదిలా ఉంటే సత్తుపల్లి ప్రాంతం ఆంధ్రా సరిహద్దు కావడంతో అక్కడి జనాలు సత్తుపల్లి ప్రాంతానికి రాకపోకలు సాగిస్తూ కరోనా ఉదృతిని విపరీతంగా పెంచేశారు. రాష్ట్రంలోనే కోవిడ్ పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్న ప్రాంతం సత్తుపల్లి కావడంతో ప్రభుత్వ దృష్టి సత్తుపల్లిపై పడింది. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వం వైద్య,ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీని హెలీకాప్టర్ లో సత్తుపల్లికి పంపించి నివేదికను తెప్పించుకుంది. దీంతో మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కోవిడ్ కేసుల ప్రస్తావన రావడం, ఇదే క్రమంలో సత్తుపల్లిలో కేసులు అధికం గా నమోదవుతున్న చర్చ రావడం, దీంతో పాటు స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పదేపదే ఆసుపత్రి విషయమై రిప్రజెంటేషన్ ఇవ్వడం దృష్ట్యా సత్తుపల్లిలో 100 పడకల ఆవశ్యకత ఎంత ప్రాధాన్యత ఉందో ప్రభుత్వం గుర్తించింది. దీంతో సత్తుపల్లిలో సకల సౌకర్యాలతో 100 పడకల ఆసుపత్రికి నూతన భవనాన్ని నిర్మాణం చేపట్టేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పాటు వైద్య, ఆరోగ్యశాఖకు గ్రీన్ సిగల్ ఇవ్వడం కూడా జరిగిపోయింది.
సత్తుపల్లి ప్రజల చిరకాల కోరిక నెరవేరింది... ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
సత్తుపల్లిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కావాలంటూ శక్తివంచన లేకుండా కృషి చేయడం జరిగిందని స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ప్రభుత్వం మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సత్తుపల్లికి 100 పడకలతో నూతన ఆసుపత్రి భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. దీంతో సత్తుపల్లి ప్రజల చిరకాల కోరికను ముఖ్యమంత్రి కేసీఆర్ నెరేర్చారని ఎమ్మెల్యే సండ్ర ఆనందం వ్యక్తం చేశారు. నూతన హంగులతో ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించిన నేపధ్యంలో బుధవారం హైదరాబాద్ ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి ఎమ్మెల్యే సండ్ర ధన్యవాదాలు తెలిపారు.