Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పొడి దుక్కలోనే పత్తి విత్తనాలు నాటుతున్న రైతులు
నవతెలంగాణ- కల్లూరు
తొలకరి వర్షాలు పడటంతో రైతులు ఖరీఫ్ సీజన్ పనులు ప్రారంభించారు. మేలో పడ్డ వర్సాలకు దుక్కులు దున్ని పొలాలను శుభ్రం చేశారు. దీంతో ఇటీవల పడ్డ వర్షాలకు దుక్కులు దున్ని పత్తి సాగుచేయటానికి రైతులు సిద్దం చేసుకొని పొడి దుక్కిలోనే పత్తి విత్తనాలు వేస్తున్నారు. మండలంలో బత్తులపల్లి, లక్ష్మీపురం, ఎర్రబంజర, కొత్త బోడిమల్లి, చిన్న కొరుకొండి, తాళ్ళూరు తదితర గ్రామాలలో పత్తి సాగుకు శ్రీకారం చుట్టారు. వరిసాగు చేసే రైతులు పొలాలులో జిలుగులు చల్లి పచ్చి రొట్టా ఎరువులు కోసం దుక్కులు దున్నుతున్నారు. అదే విధంగా వరినారు పోయడం కోసం సిద్ధం చేస్తున్నారు. ఈ విధంగా ఖరీఫ్ వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఖరీఫ్‌లో వ్యవసాయ శాఖ మండలంలో సాగుచేసే పంటల అంచనాలు రూపొందించారు. మండలంలో వరి 33,500 ఎకరాలు, పత్తి 4200 ఎకరాలు, కంది 175 ఎకరాలు, పెసర 337 ఎకరాలు, మినుము 32 ఎకరాలు, చెరకు 230 ఎకరాలు, మిర్చి 1320 ఎకరాలలో సాగుచేస్తారని వ్యవసాయ శాఖ అధికారి ఎం.రూప తెలిపారు. రైతులు వర్షాలు పడ్డ తర్వాత విత్తనాలు వేయాలని, సకాలంలో వర్షం పడకపోతే ఖరీదైన విత్తనాలు నష్టపోతారని తెలిపారు. రైతులు తొందరపడి సాగు చేస్తే ఇబ్బందులు పడతారని పేర్కొన్నారు.