Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డయాగస్టిక్ హబ్ కేంద్రాలను ప్రారంభించిన మంత్రి
నవతెలంగాణ- ఖమ్మం
ప్రజలందరికీ ఉచితంగా వ్యాధి నిర్ధారణ వైద్య పరీక్షల సేవలకు గాను తెలంగాణ డయాగ్నిస్టిక్ హబ్ కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయకుమార్ తెలిపారు. బుదవారం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నిస్టిక్ హబ్‌ను ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామానాగేశ్వరరావు, జిల్లా ఆసుపత్రి అభివద్ధి కమిటీ చైర్మన్ లింగాల కమలరాజు, జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్జన్‌తో కలిసి బుధవారం మంత్రి ప్రారంభించారు. పేదప్రజలకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఆర్థిక భారంగా మారిందని, ప్రజలందరికి ఉచితంగా వ్యాధి నిర్ధారణ సేవలందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సుమారు 2.5 కోట్లతో వ్యాధి నిర్ధారణ పరికరాలను ఏర్పాటు చేసి డయాగ్నిస్టిక్ హబ్‌ను ప్రారంభించుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు. జిల్లా ఆసుపత్రితో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా రక్త నమూనాలను సేకరించి 57 రకాల వివిధ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించబడుతాయని, వ్యాధి నిర్ధారణ అనంతరం పేషెంట్ సెల్‌ఫోన్‌తో పాటు సంబంధిత వైద్యశాలకు టెస్ట్ రిపోర్టులు పంపబడతాయని మంత్రి తెలిపారు. జిల్లాలో నమూనా సేకరణకు ఏర్పాటు చేసిన వాహనాలను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. నగర మేయర్ పునుకొల్లు నీరజ, శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, వైరా శాసనసభ్యులు లావుడ్యా రాములునాయక్, డి.సి.సి.బి చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ అనురాగ్ జయంతి, స్థానిక కార్పొరేటర్ క్లయిమెట్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మాలతి తదితరులు పాల్గొన్నారు.