Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొబైల్ ఐసీయూ బస్సులు ప్రారంభం
- ఉమ్మడి జిల్లాకు రెండు బస్సులు కేటాయింపు
నవతెలంగాణ-గాంధీచౌక్
మొబైల్ ఐసీయూ బస్సులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ గురువారం ఖమ్మం రోటరీ నగర్ లో ప్రారంభించారు. తొలి విడుత రాష్ట్రంలో 30 బస్సులను ప్రారంభించినట్లు లార్డ్స్ చర్చి ప్రతినిధులు అబ్రహం, రమేష్‌లు వెల్లడించారు. అందులో భాగంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు 2 బస్సులను కేటాయించామని, వెరా స్మార్ట్ హెల్త్ కేర్ సహకారంతో లార్డ్స్ చర్చి ఈ ప్రాజెక్టును ప్రారంభించిందని వివరించారు. మెడికల్ యూనిట్ బస్సులో వైద్య సేవల కోసం ఒక ల్యాబ్, ఒక డాక్టర్, ఇద్దరు నర్సులతో పాటు ఆక్సిజన్‌తో కూడిన 10 బెడ్లు ఏసి సౌకర్యంతో అందుబాటులో ఉంటాయని వారు మంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. మెడికల్ మొబైల్ బస్సులను అందించిన లార్డ్స్ చర్చికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ లాంటి పరిస్థితుల్లో మెడికల్ యూనిట్ బస్సుల ప్రారంభం సంతోషంగా ఉందన్నారు. కోవిడ్ వల్ల ఆరోగ్య సిబ్బంది గొప్పతనం అందరికీ తెలిసిందన్నారు. ఈ కష్టకాలంలో కోవిడ్ సేవలలో భాగస్వామ్యం అయినందుకు వారిని అభినందించారు. బస్సులను ప్రారంభించిన అనంతరం బస్సులో ఉన్న వైద్య సదుపాయాలను మంత్రి పువ్వాడ పరిశీలించారు.
వ్యాక్సినేషన్ తీరును పరిశీలించిన మంత్రి పువ్వాడ
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సూపర్ స్ప్రెడర్లకు వాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఖమ్మం నగరంలోనే శాంతినగర్ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ తీరును రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ పరిశీలించారు. ఆయా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేసినట్లు అందరికీ వ్యాక్సినేషన్ అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఎప్పటికప్పుడు కోవిడ్ కేంద్రాల వివరాలు సేకరించాలని జిల్లా వైద్యాధికారి మాలతికి సూచించారు. వారి వెంట మేయర్ పునుకొల్లు నీరజ, కలెక్టర్ కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, సుడా చైర్మన్ విజరు, కార్పొరేటర్లు కమర్తపు మురళి, మందడపు మనోహర్, ఉన్నారు.
ఖమ్మం నూతన బస్టాండ్ ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ ఆకస్మికంగా పరిశీలించారు. గురువారం అటుగా వెళ్తున్న మంత్రి బస్టాండ్ లోకి వెళ్లారు. అక్కడ సౌకర్యాలను కలియ తిరిగి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ , జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి, సుడా చైర్మన్ విజరు, ఆర్టీసీ డివిఎం సుగుణాకర్, డిఎం శంకర్, ఎస్ఎం రఘునాథ, సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు.