Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొందరి తప్పిదాలను విత్తన డీలర్లందరికీ ఆపాదన
- ఫామ్- సీ లైసెన్స్ పేరుతో విచ్చలవిడిగా దాడులు
- తప్పుడు ఆరోపణలతో ఇబ్బంది పడుతున్న డీలర్లు
- అన్ని అనుమతులున్నా.. బిల్లులిచ్చినా నమ్మలేని దుస్థితి
- లేనిపోని ఆరోపణలతో రైతుల్లో మరింత గందరగోళం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
లైసెన్స్లు కలిగి..పన్నులు చెల్లించి... బిల్లులు ఇచ్చి నిజాయితీగా వ్యాపారం చేసినా నకిలీ విత్తనాలనే ముద్రతో విత్తన డీలర్లు ఇబ్బంది పడుతున్నారు. అసలు ఏదో...నకిలీ ఏదో తెలియక రైతులు మరింత గందరగోళానికి గురవుతున్నారు. కొందరు లైసెన్స్ లేకుండా విత్తనాలు విక్రయిస్తే వాటిని అధికారులు నకిలీ విత్తనాలుగా పేర్కొంటూ మీడియా ముఖంగా ప్రకటిస్తున్నారు. దీనివల్ల ఆ కంపెనీ ప్రతిష్ట దెబ్బతింటోంది. అన్ని అనుమతులతో నిబంధనల కనుగుణంగా అదే కంపెనీకి చెందిన నాణ్యమైన విత్తనాలు అమ్ముతున్న డీలర్లు ఈ కారణంగా ఇబ్బంది పడుతున్నారు. రైతులు కూడా ఆ కంపెనీ విషయంలో నకిలీవనే నిర్ధారణకు వచ్చేస్తుండటంతో సంబంధిత కంపెనీలు, డీలర్లు నష్టపోతున్న సందర్భాలున్నాయి. వ్యవసాయ అధికారులు, పోలీసు అధికారులు ఇలాంటి విషయాల్లో ప్రకటన చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విత్తన డీలర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేస్తోంది. షాపు వద్దకు సరుకు వచ్చాక దాడులు చేసే బదులు విత్తన సరఫరాకు ముందు గోదాంలలో ఉన్నప్పుడే చర్యలు తీసుకోవచ్చుగా అనే ప్రశ్న తలెత్తుతోంది. అనుమతులున్నాయా? లేదా?? అనేది అక్కడే పరిశీలించి ఆ తర్వాత డీలర్లకు విక్రయిస్తే అటు రైతులు, ఇటు డీలర్ల క్షేమం కోరినవారతారని అంటున్నారు.
- ఫామ్-సీతో తంటాలు...
ఒక్కోసారి అధికారుల హడావుడితో నాణ్యమైన విత్తనం కూడా నకిలీ... మకిలీనంటించుకుంటోంది. ఒక రాష్ట్రంలో తయారైన విత్తనం మరో రాష్ట్రంలో విక్రయించాల్సి (అంతరాష్ట్ర వాణిజ్యం) వస్తే అమ్మే రాష్ట్రంలోనూ ఫామ్-సీ లైసెన్స్ తీసుకోవాలి. ఉదా: కర్ణాటక రాష్ట్రంలో ఓ విత్తనం తయారైతే దాన్ని తెలంగాణలో విక్రయించాల్సి వస్తే అటు కర్ణాటకలోనూ, ఇటూ తెలంగాణలోనూ లైసెన్స్ పొందాలి. వాస్తవానికి ఇది 25 జూలై 2016 నుంచి రాష్ట్రంలో అమల్లో ఉంది. కానీ గతేడాది వరకు ఫామ్-సీ లైసెన్స్ విషయంలో ప్రభుత్వానికి పట్టింపు లేదు. విత్తన డీలర్లకు ఫామ్-సీతో నిమిత్తం లేదని హైకోర్టు గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. కానీ ఇప్పటికిప్పుడు ఫామ్-సీ లేదన్న కారణంతో ఆకస్మికంగా దాడులు నిర్వహిస్తుండటం, షాపులను సీజ్ చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఫామ్-సీ విషయంలో కొంత సమయం ఇచ్చి ఆలోగా ఆ లైసెన్స్ తీసుకోని వారిపై దాడులు నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయం విత్తన డీలర్స్ అసోసియేషన్ నుంచి వెలువడుతోంది.
- 'స్టాప్ సేల్'తో మరింత టెన్షన్
ఒకవేళ ఒకవిత్తన రకం ఫామ్-సీలో లేకపోతే వ్యవసాయ, పోలీసుశాఖల అధికారులు దాడులు నిర్వహించి 'స్టాప్ సేల్' అని రాసి ఆ విత్తన అమ్మకాలను నిలిపివేస్తున్నారు. ఇదంతా తెలియని రైతులు ఆ విత్తనాలు నకిలీవని, అవి అమ్ముతున్న డీలర్లను తప్పుడు దృష్టితో చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆ డీలర్లు తమ నిజాయితీని నిరూపించుకోవడం ఓ సమస్యగా మారింది. ప్రభుత్వ నిబంధనల మేరకు వ్యాపారాలు నిర్వహిస్తున్నా ప్రతియేటా సీజన్ ఆరంభంలో ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు. వ్యవసాయశాఖ, పోలీసుశాఖ, టాస్క్ఫోర్స్, విజిలెన్స్, స్పెషల్ పార్టీ అంటూ ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేస్తుండటంతో అటు వ్యాపారులు, ఇటు రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ అనుమతితోనే విత్తనాలు మార్కెట్లోకి వస్తాయి కాబట్టి...ఉత్పత్తి అయ్యేచోటే నకిలీలను అంటగడితే ఇంత సమస్య ఉండదనే ప్రశ్న తలెత్తుతోంది. పత్తి విత్తన ప్యాకెట్లకు ఏ విధంగా ధర నిర్ణయించారో...అదే మాదిరి ప్రభుత్వం విత్తన కంపెనీల యాజమాన్యాలు, ఉన్నతాధి కారులతో సమీక్షించి మిర్చి తదితర పంటల విత్తనాలకు కూడా ఓ రేటు నిర్ణయిస్తే బాగుంటుందనే అభిప్రాయం వెలువడుతోంది. దీనివల్ల నకిలీ అనే ప్రశ్నే తలెత్తదంటున్నారు. ఎవరో ఒకరిద్దరు కక్కుర్తి పడి లైసెన్స్ లేకుండా విత్తనాలు విక్రయిస్తే మొత్తం డీలర్ల వ్యవస్థకు ఆపాదించి చూడటం తగదని పలువురు వ్యాపారులు వాపోతున్నారు.
- ఇలా చేస్తే విత్తన సంక్షోభం తప్పదు
రామడుగు మోహన్రావు,
ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ డీలర్స్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా సెక్రటరీ
ప్రభుత్వం ఫామ్-సీ లైసెన్స్ లేదన్న కారణంతో ఇలాగే దాడులు చేస్తే విత్తన సంక్షోభం తప్పదు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఫామ్-సీ లైసెన్స్ కచ్చితం అనే విషయం ముందే చెప్పాలి. 2016 నుంచి గతేడాది వరకు దీని విషయంలో పట్టింపు లేని ప్రభుత్వం ఇప్పటికిప్పుడు దాడుల చేయడం సరికాదు. ఫామ్-సీ పొందేందుకు కొంత గడువు ఇవ్వాలి. ఆ గడువులోగా తీసుకోకపోతే ఆ తర్వాత దాడులు చేయాలి. ఓ విత్తన కంపెనీకి ఫామ్-సీ ఉందో లేదో చూసి ఆతర్వాతే లైసెన్సింగ్ అథారిటీ దానికి అనుమతి ఇస్తే ఈ సమస్య ఉండదు కదా..! ఫామ్-సీలో పొందుపరిచే ఆ తర్వాత లైసెన్స్ ఇస్తే సరిపోతుంది. కానీ ఇలా అడ్డగోలుగా దాడులు నిర్వహిస్తే వ్యాపారాలు నిర్వహించడం కష్టమవుతుంది. తద్వారా విత్తన సంక్షోభం ఏర్పడుతుంది. నకిలీ, అనుమతిలేని విత్తనాల విక్రయాన్ని మేమూ వ్యతిరేకిస్తున్నాం.