Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బోనకల్
వ్యవసాయ సీజను ప్రారంభమైనందు వలన నకిలీ విత్తనాలను అరికట్టి నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించాలని సిపిఎం మండల కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు మండల పరిషత్ కార్యాలయం వద్ద మండల వ్యవసాయ శాఖ అధికారి అబ్బూరి శరత్ బాబుకి శుక్రవారం వినతి పత్రం అందజేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు రైతుల పంటలకు మద్దతు ధర ప్రకటించాలని కోరారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారని, కానీ నేటి వరకు రుణమాఫీ చేయలేదని ఇప్పటికైనా రుణమాఫీ దశల వారీగా కాకుండా ఒకేసారి చేయాలని ఆ వినతిపత్రంలో డిమాండ్ చేశారు. వానాకాలం పంటలు ప్రారంభమై నందున ప్రభుత్వమే రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీపై విత్తనాలను అందజేయాలని కోరారు. రైతులకు అవసరమైన విత్తనాలను మాత్రమే సరఫరా చేయాలని, అవసరం లేని విత్తనాలను సరఫరా చేసి తాము రైతులకు విత్తనాలను సకాలంలో అందిస్తున్నామని చెప్పుకోవడానికి చేయవద్దని కోరారు. ఈ వినతి పత్రం అందజేసిన వారిలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు, మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గుగులోతు రమేష్, రావినూతల, రామాపురం, లక్ష్మీపురం ఎంపీటీసీలు కందిమల్ల రాధ, ముక్కపాటి అప్పారావు, జొన్నలగడ్డ సునీత, లక్ష్మీపురం సొసైటీ అధ్యక్షుడు మాది నేని వీరభద్రరావు తదితరులు ఉన్నారు.