Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాదినేని రమేష్
వతెలంగాణ- నేలకొండపల్లి
ప్రస్తుత వానాకాలం సీజన్ ప్రారంభమై నందున రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాదినేని రమేష్ డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదుట రైతు సంఘం, ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ సీజన్ ప్రారంభమై పది రోజులు దాటినా నేటికీ వ్యవసాయ ప్రణాళిక, రుణ ప్రణాళిక ప్రభుత్వం విడుదల చేయకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తుంది అన్నారు. రైతులు విత్తనాలు కోసం తీవ్ర ఆందోళన చెందుతున్నారని, మరోవైపు కల్తీ విత్తనాల బెడద రైతులు తీవ్రంగా వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకూర నుండి పత్తి విత్తనాలు వరకు కోట్ల రూపాయలు వరకు నకిలీ దందా నడుస్తుందని, ఇప్పటికే టాస్క్ఫోర్స్ అధికారుల దాడులలో పట్టుబడినట్లు వార్తలు రావడం ప్రభుత్వ అసమర్థతకు అద్దం పడుతుంది అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అన్ని మండల కేంద్రాలలో అవసరమైన, నాణ్యమైన విత్తనాలను మార్కెట్ కమిటీల ద్వారా ప్రభుత్వ సంస్థల ద్వారా అందించాలని, ఐదెకరాల లోపు రైతులకు విత్తనాలను పూర్తి సబ్సిడీపై అందించాలని డిమాండ్ చేశారు. రైతుల రుణమాఫీని ఏక కాలంలో పూర్తిచేయాలని, రైతులందరికీ ఈనెల 15 లోపు కొత్త రుణాలను అందించాలని అన్నారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు తగినన్ని అందుబాటులో ఉంచాలని, ఐదెకరాల లోపు రైతులకు ఎరువుల సబ్సిడీ ఇవ్వాలని, నకిలీ విత్తనాలు అమ్మే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ తాళ్లూరి సుమకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు గుడవర్తి నాగేశ్వరరావు, ఏటుకూరి రామారావు, మండల అధ్యక్ష కార్యదర్శులు రచ్చ నరసింహారావు, సిరికొండ నాగేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కేవీ రామిరెడ్డి, సిఐటియు మండల కార్యదర్శి పగిడికత్తుల నాగేశ్వరరావు, మారుతి కొండలరావు, ఎం నరసింహారావు, సామల మల్లికార్జున రావు పాల్గొన్నారు.