Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోన కష్టకాలంలో అన్నార్తులకు అండగా రెండేండ్ల సేవలకు ఎమ్మెల్యే,
- ప్రముఖుల ప్రశంసలు..
- నిత్యావసరాలతో పాటు ప్రతిరోజు వందల మందికి పోషకాహార వితరణ
నవ తెలంగాణ-సత్తుపల్లి
తల్లిదండ్రులను, తోబుట్టువులను కూడా పట్టించుకోని నేటి సమాజంలొ అన్నార్తులకు అండగా... కష్టకాలంలో చేయూతనిస్తూ భావితరాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుంది సత్తుపల్లికి చెందిన నవచైతన్య స్వచ్ఛంద సేవా సంస్ద. ఓ వైపు కరోనా కోరలు చాచి కరాళ నత్యం చేస్తున్నా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా సేవాభావంతో సాయం చేస్తున్న నవచైతన్య స్వచ్ఛంద సేవా సంస్ద సత్తుపల్లి ప్రాంతంలో హాట్ టాపిక్ గా మారింది. సంస్ద లక్ష్యాలు, ఉధ్డేశాలు ఏవైనా గడిచిన 2 ఏండ్లుగా వారు చేస్తున్న సేవలు అనిర్వచనీయమనే చెప్పాలి.
లాక్డౌన్లో ఆకలి కష్టాలు సత్తుపల్లిలో తక్కువే......
గడిచిన 2 ఏండ్ల లాక్ డౌన్ సమయంలోనూ నవ చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని అన్ని వార్డుల కౌన్సిలర్లు, మండల పరిధిలోని పంచాయితీల సర్పంచ్ ల ద్వారా అక్కడి పేదల జాబితాను సిద్ధం చేసుకుని ప్రతిరోజు సంస్థ వాలంటీర్ల సహకారంతో వంట చేయడం, వాటిని ప్రత్యేకంగా ప్యాక్ చేసి ప్రాంతాల వారీగా పంచడంతో చాలా వరకు ఆకలి కష్టాలు తగ్గాయి. ఈ ఏడాది కరోనా విషకోరలు చాచడంతో ఆహార పంపిణీని అవసరం మేరకు చేస్తు కరోనా బాధిత పేద కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, నిత్యావసరాలు, పండ్లు, గుడ్లు అందజేస్తున్నారు.
కాకర్లపల్లి ఐసోలేషన్ కేంద్రానికి 2 పూటలా పౌష్టికాహారం.....
మండల పరిధిలోని కాకర్లపల్లి హైస్కూల్ లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రానికి ప్రతిరోజు రెండు పూటలా పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు. గ్రామ సర్పంచ్ కంచర్ల రమాదేవి సమాచారం మేరకు మొదటి రోజు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. దీంతో పాటు ప్రతి 2 రోజులకోసారి మాంసాహారంతో భోజనం అందిస్తున్నారు. నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని ప్రత్యేక ప్యాకెట్ లలో వేడిగా అందిస్తుండటం పట్ల ఐసోలేషన్లో ఉంటున్న వారు కూడా కతజ్ఞతలు తెలియజేయడం వారి సేవాలకు ఉన్న ప్రత్యేకతకు అద్దం పడుతోంది. అదే విధంగా పట్టణంలోని పలు వార్డుల్లో హౌం ఐసోలేషన్లో ఉంటున్న పేదలకు కూడా ఆహార సేవలు అందిస్తున్నారు. ప్రతి రోజు 2 పూటల సమయాను గుణంగా స్వయంగా తీసుకెళ్లి అందించడం పట్ల ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, ప్రముఖులు అభినందిస్తున్నారు.
ప్రముఖుల ప్రశంసలే మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నాయి.....
నవచైతన్య నిర్వాహకులు వ్యక్తిగతంగా వారివారి వత్తి, ప్రవత్తి రీత్యా బిజీగా ఉంటూనే సేవాభావంతో ప్రారంభించిన కార్యక్రమాలకు మంచి స్పందన రావడంతో పూర్తి సమయం కేటాయించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రత్యేకంగా అభినందించడంతో పాటు పలుమార్లు వారి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదే విధంగా ప్రముఖ కార్పొరేట్ కంపెనీ అయిన కిన్లే(సర్వరాయ ఘగర్స్ బాటిలింగ్ లిమిటెడ్) సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటిలో భాగంగా గత ఏడాది సేవా కార్యక్రమాలకు నవ చైతన్య స్వచ్ఛంద సేవా సంస్దను ఎంపిక చేసి వారి ద్వారా పట్టణంలో 500 కుటుంబాలకు ప్రతి ఒక్కరికి సుమారు రూ.1 వెయ్యి విలువ గల బియ్యం, నిత్యావసరాలు, కూరగాయలను అందజేయడం విశేషం. సంస్థ ఆధ్వర్యంలో సంచార జాతుల వారు, గిరిజనులు, పేద వారైనా 600 పేద కుటుంబాలను గుర్తించి నిత్యావసర కిట్లను అందజేశారు. మండల పరిధిలోని బాచారం గ్రామంలో అగ్ని ప్రమాదంతో నిరాశ్రయులైన కుటుంబానికి అండగా నిలిచి ఇండ్లు కట్టించి, నూతన వస్త్రాలు, సామాగ్రి అందజేయడం ఇలా చెప్పుకుంటూ పోతే వారు చేసిన కార్యక్రమాలకు కొదవే లేదు. ఈ నేపథ్యంలో అనేక ప్రశంసలు అందుకున్నారు. ఈ ప్రశంసలు, ప్రోత్సాహకాలతోనే వారు రెట్టించిన ఉత్సాహంతో సేవ చేస్తున్నామంటున్నారు నిర్వాహకులు.
3మండలాలకు సేవలు విస్తరించాం....గాదె నరసింహారెడ్డి, అధ్యక్షులు
నవచైతన్య స్వఛ్చంద సేవా సంస్థ సేవలను ఇప్పటికే 3 మండలాలకు విస్తరించాం. గత ఏడాది పెనుబల్లి మండలం కే.డబ్ల్యు చౌడ వరంలో 40 ఛత్తీస్గఢ్ వలస కుటుంబాలకు, ఈ ఏడాది మండల పరిధిలోని పలు గ్రామాల్లో మొత్తం 36 కుటుంబాలకు నిత్యావసరాల కిట్లను అందజేశాం. వేంసూరు మండలంలో గత ఏడాది ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎం సుమారు 60 మం దికి ఈ ఏడాది సుమారు పలు గ్రామల్లో 18 కుటుంబాలకు నిత్యావసర కిట్లను అంద జేశాం. సత్తుపల్లి పట్టణ, మండల పరిధిలోని గ్రామాల్లో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఆపత్కాలంలో చేసిందే నిజమైన సేవ
.....తోట కిరణ్, ప్రధాన కార్యదర్శి.
ఆపత్కాలంలో అవసరార్థులకు అండగా నిలుస్తూ అందించే సేవలే నిజమైనవి, అందునా కరోన కష్టకాలంలో పేగు బంధం కూడా కానరావడం లేదు. ఇలాంటి సందర్భంలో తప్పకుండా సేవ చేయాలనే సంకల్పంతోనే ప్రారంభించి కొనసాగిస్తున్నాం. దాతల కోసం ఎదురు చూడలేదు...ఎవ్వరిని అడగలేదు. చేస్తున్న సేవలకు ప్రభావితులై స్వచ్ఛందంగా దాతలు ముందుకొచ్చి సహకరిస్తున్నారు. పూర్తి పారదర్శకంగా సేవలందిస్తున్నాం.