Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫామ్- సీ పేరుతో విత్తన డీలర్లు, రైతాంగంలో గందరగోళం
- వ్యవసాయ సమస్యలపై నేడు రైతు సమరభేరి ఆన్లైన్ బహిరంగసభ
- అర్హులందరికీ రేషన్‌కార్డులు ...57 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలి
- జులై నుంచి ఇవి అమల్లోకి తెస్తూ కేబినెట్లో నిర్ణయించాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఫామ్-సీలో పొందుపరచని విత్తన రకాలను అనుమతిలేని వాటిగా, నకిలీలుగా చిత్రీకరించి విత్తన డీలర్లను, రైతాంగాన్ని ప్రభుత్వం గందరగోళానికి గురిచేస్తోందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఆరోపించారు. పరోక్షంగా ప్రభుత్వమే విత్తన సంక్షోభానికి కారణమవుతుందన్నారు. ఫామ్-సీ లైసెన్స్ పేరుతో విత్తన డీలర్లను వేధింపులకు గురిచేయడం తగదన్నారు. వ్యవసాయ సమస్యలపై రైతు సమరభేరి ఆన్లైన్ బహిరంగ సభ ఆదివారం సాయంత్రం నిర్వహించనున్నట్లు తెలిపారు. స్థానిక సుందరయ్యభవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వర్లు, యర్రా శ్రీకాంత్‌తో కలిసి నున్నా మాట్లాడారు. 4.42లక్షల రేషన్కార్డ్సు పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించిందని, వాస్తవానికి పది లక్షల రేషన్కార్డ్సు జారీ చేయాల్సి ఉందన్నారు. గతంలో దరఖాస్తు చేసుకోని వారికి కూడా రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. జూన్ 30వ తేదీ దాకా దరఖాస్తుల పరిశీలన, నూతన దరఖాస్తులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌కార్డులు ఇవ్వాలని, ఖమ్మం జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 60వేలకు పైగా దరఖాస్తుదారులకు రేషన్కార్డ్స్ ఇవ్వాలని కోరారు. కొత్త రేషన్‌కార్డులు, పెన్షన్ల కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో అనేకమార్లు ఆందోళనలు చేసినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2015లో ఆసరా పింఛన్లు ఇచ్చే నాటికి 60 ఏళ్లకంటే ఒక్కరోజు తగ్గినా పెన్షన్లకు అనర్హులుగా గుర్తించారన్నారు. ఆ తర్వాత ఏడేళ్లుగా నూతన పెన్షన్ అర్హులను గుర్తించలేదన్నారు. 2018 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు సీఎం కేసీఆర్ 57 ఏళ్లకు పైబడిన అర్హులందరికీ జులై నుంచి పెన్షన్లు ఇవ్వాలని నున్నా డిమాండ్ చేశారు. సోమవారం జరిగే కేబినేట్లో వీటిపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైన దృష్ట్యా రైతులకు విత్తనాలు, రుణాలు సమర్థవంతంగా ఇవ్వాలన్నారు. రూ.లక్ష పంట రుణమాఫీ చేయాలని, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం కొత్తరుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫామ్- సీ లైసెన్స్ ద్వారా ఎక్కువ మంది డీలర్లకు అమ్మే అవకాశం లేకుండా పోయిందన్నారు. ఒక్కరిద్దరికే అవకాశం ఉండటం వల్ల అధిక రేటుకు అమ్ముతున్నారని తెలిపారు. కేజీ మిర్చి విత్తనాలు రూ.60వేలకు అమ్ముతు న్నారని అన్నారు. పరోక్షంగా ప్రభుత్వమే విత్తన సంక్షోభం సృష్టిస్తుందన్నారు. లైసెన్స్ ఉన్న ప్రతి డీలర్ స్వేచ్ఛగా విత్తనాలమ్ముకునే అవకాశం ఇవ్వాలన్నారు. ప్రభుత్వ వైఖరీ కారణంగా విత్తనాల రేట్లు కూడా పెరుగుతున్నాయన్నారు. నకిలీ విత్తనాలపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టిసారించాలని కోరారు. నామమాత్రపు దాడులతో సరిపెట్టడం సరికాదన్నారు. నకిలీ విత్తనాలు ఎక్కడ ఉత్పత్తి చేస్తున్నారో అక్కడి నుంచి చర్యలు తీసుకోవాలని కోరారు. విత్తనాలు ఫ్రీగా ఇస్తామన్న కేంద్రం ఆ హామీనే విస్మరించిందన్నారు. కేంద్రం పంటలకు ఇస్తున్న మద్దతు ధరలు ఏమాత్రం సరిపోయేవి కావన్నారు. క్వింటా ధాన్యం మీద ఒక్కో రైతు రూ.900 వరకు నష్టపోతున్నాడని తెలిపారు. పత్తి విషయంలోనూ క్వింటాకు రూ.3,000కు పైగా రైతు నష్టపోతున్నాడని అన్నారు. ఉత్పత్తి, ఖర్చు ఆధారంగా పంటలకు మద్దతు ధర నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలన్నింటిపై ఆన్లైన్లో ఆదివారం సాయంత్రం నిర్వహించే రైతు సమరభేరి బహిరంగసభను విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ సమస్యల పరిష్కారానికి సోమవారం జిల్లా వ్యాప్తంగా మండలకేంద్రాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.