Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుర్రి ప్రసాద్
నవతెలంగాణ-ఖమ్మం
కరోనా నేపథ్యంలో ఉపాధి కూలీలకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుర్రి ప్రసాద్ డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం సంఘం జిల్లా అధ్యక్షులు వేరు సత్యనారాయణ అధ్యక్షతన ఖమ్మం సుందరయ్య భవనంలో శనివారం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఉపాధి కూలీలను గుంపులు గుంపులుగా పని చేయించటం వల్ల మరింతమంది కరోనా బారిన పడి అనేక ఇబ్బందులు పడుతున్నారని వెంటనే ఉపాధి పనులను ఆపి ఉపాధి కార్డు ఉన్న వాళ్లందరికీ నెలకు రూ.7500 నిరుద్యోగ భృతి ఇవ్వాలని 50 కేజీల బియ్యం కేరళ తరహాలో 17 రకాల నిత్యవసర వస్తువులను అందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కరోనా కాలంలో డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు పెంచి అన్ని నిత్యావసర వస్తువుల రేట్లు ప్రజలకు అందుబాటులో లేకుండా వ్యవసాయ కార్మికులను అర్ధాకలితో చంపుతున్నారని విమర్శించారు. భారతదేశంలో 135 కోట్ల మంది ప్రజలు ఉంటే 300 కోట్ల వ్యాక్సిన్లు అవసరం కాగా కేవలం 20 కోట్ల వ్యాక్సిన్లు ఆర్డర్ పెట్టడం ప్రజల ఆరోగ్యం మీద కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని దానివల్లనే కరోనా అనేకమంది పేదలు చనిపోతున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ముందు చూపు లేదని, ఇప్పటికైనా వైద్యం మీద ప్రత్యేక దష్టి పెట్టి కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రజలని రక్షించాలని డిమాండ్ చేశారు.
సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ గ్రూపులకు ఉపాధి బిల్లులు మూడు వారాల నుంచి 11 వారాల వరకు పెండింగ్లో ఉన్నాయని వాటిని తక్షణం విడుదల చేయాలని జిల్లా అధికారులను డిమాండ్ చేశారు. రానున్న కాలంలో వర్షాలు పడితే సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆరోగ్యశాఖ అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా నాయకులు పొన్నగంటి సంగయ్య, మండవ కృష్ణారావు, గద్దల రత్నమ్మ, భారీ మల్సూరు, బందెల వెంకయ్య, బంధం శ్రీనివాసరావు, మంద సైదులు, వడ్లమూడి నాగేశ్వరరావు, వేల్పుల భద్రయ్య, కె.వి.రెడ్డి, బాదావత్ శ్రీనివాస్, మేడి బిక్షం, తదితరులు పాల్గొన్నారు.