Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారిపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాల నిరోధంపై తీసుకోవాల్సిన చర్యలపై ఆయన డిజిపి ఎం.మహేందర్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్, సీనియర్ పోలీసు, వ్యవసాయ అధికారులు, పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంతో కష్టించి పంట పండించే రైతన్నలకు నకిలీ విత్తనాల బారిన పడకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులకు సరఫరా చేసే నకిలీ విత్తనాలు తయారుచేసే వారిపై సరఫరా చేసే కంపెనీలపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని చెప్పారు. విత్తన దుకాణాలలో తనిఖీ చేసే క్రమంలో అధికారులు దుకాణ యజమానులు సరిదిద్దుకునే అంశాలు, సరిదిద్దుకోలేని ఆంశాల పరిగణలోకి తీసుకొని చర్యలు చేపట్టాలని సూచించారు. కల్తీ విత్తనాలు, గడువు ముగిసిన విత్తనాలను, నాణ్యత లేని నాసిరకం విత్తనాల సరఫరాలో తరచుగా అలవాటుపడిన నేరస్తులపై పీడీ యాక్ట్ అమలు చేయాలని సూచించారు, జిల్లాలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చే సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ జిల్లాలో నకిలీ విత్తనాల నియంత్రణకు చేపట్టిన చర్యలు వివరించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ లాండ్ ఆర్డర్ సుభాష్‌చంద్రబోస్, ఏసీపీలు ప్రసన్న కుమార్, రామానుజం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.