Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పొలాలను సిద్ధం చేస్తున్న అన్నదాతలు
- 29,145 ఎకరాలకు సాగు ప్రణాళిక
నవతెలంగాణ-బోనకల్
బోనకల్ మండలంలో వానాకాలం పంటలను సాగు చేసేందుకు అన్నదాతలు పొలాలను సిద్ధం చేస్తున్నారు. మండల పరిధిలోని 22 గ్రామాలలో అన్నదాతలు పొలాలను విత్తనాలను సాగు చేసేందుకు వీలుగా పొలాలను తయారు చేస్తున్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో అన్నదాతలు పొలాలపై దష్టిసారించారు. వానాకాలం పంటలుగా మండల వ్యాప్తంగా 29 వేల 145 ఎకరాలలో వివిధ రకాల పంటలను అన్నదాతలు సాగు చేయనున్నట్లు మండల వ్యవసాయ శాఖ అధికారులు పంటల అంచనాను రూపొందించారు. గత సంవత్సరం 28,893 ఎకరాలలో వివిధ రకాల పంటలను సాగు చేశారు. గత ఏడాది కంటే ఈ ఏడాది అద నంగా 252 ఎకరాలలో వివిధ రకాల పంటలను అన్నదాతలు సాగు చేయనున్నట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి అబ్బూరి శరత్ బాబు తెలిపారు. వానాకాలం పత్తి 19,900 ఎకరాలలో, వరి 6,250 ఎకరాల్లో, మిర్చి ఇరవై మూడు వందల ఎకరాల్లో అన్నదాతలు సాగు చేయనున్నట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి తెలిపారు. కంది 165 ఎకరాల్లో, పెసర 470 ఎకరాలలో, మినుము 60 ఎకరాలలో అన్నదాతలు సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. గత ఏడాది మండలంలో పత్తి పంట సాగు చేసిన అధికారులు వరుస వర్షాలతో తీవ్రంగా నష్టపోయారు. ఒక్కొక్క ఎకరానికి 25 వేల రూపాయల వరకు అన్నదాతలు పెట్టుబడి పెట్టారు. కానీ ఎకరానికి రెండు మూడు క్వింటాలు మాత్రమే దిగుబడి వచ్చింది. దీంతో అన్నదాతలు పత్తి పంటను సాగు చేసి అప్పుల పాలయ్యారు. పత్తి పంటకు తీవ్ర నష్టం జరగడంతో మధ్యలోనే ఆ పంటను తొలగించి అన్నదాతలు మొక్కజొన్న పంటను సాగు చేశారు. మొక్కజొన్న పంట వల్ల కొంతమేరకు అన్నదాతలు ఉపయోగం జరిగింది. కానీ వ్యవసాయ సీజన్ అంత పరిశీలిస్తే గత ఏడాది రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయారు. ఒకవైపు ప్రభుత్వ విధానం మరొకవైపు ప్రకృతి దెబ్బతో అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఈ ఏడాది వ్యవసాయం ఎలా ఉంటుందోనని అన్నదాత అప్పుడే ఆందోళనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ మరోమార్గం లేక వ్యవసాయంపై దృష్టి సారించారు. మండల వ్యాప్తంగా ఈ ఏడాది వానాకాలం పంటలను సాగుచేసేందుకు అన్నదాతలు ముమ్మరంగా పొలాలను సిద్ధం చేస్తున్నారు.