Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు ప్రభుత్వమైతే రాష్ట్రంలో ఆత్మహత్యలు ఎందుకున్నాయి?
- నేడు జిల్లా, మండల కేంద్రాల్లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నాలు
- ఖమ్మం జిల్లా రైతాంగ సమస్యలపై సీపీఐ సమరభేరి ఆన్లైన్ బహిరంగసభలో రైతు
- సంఘం జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ
సభ్యులు పోతినేని సుదర్శన్
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను దోచి.. కార్పొరేట్‌కు మేలు చేసే రైతాంగ వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయని రైతుసంఘం జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. కేంద్రం మద్దతు ధరల విషయంలో శాస్త్రీయత లేదన్నారు. కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టేందుకే నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి వంత పాడుతోందని విమర్శించారు. టీఆర్ఎస్ సర్కారు రైతు ప్రభుత్వమైతే రాష్ట్రంలో ఎందుకు ఆత్మహత్యలున్నాయని ప్రశ్నించారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన ఖమ్మం జిల్లా రైతాంగ సమస్యలపై ఆదివారం నిర్వహించిన సీపీఐ(ఎం) సమరభేరి బహిరంగసభ (ఆన్లైన్)లో మల్లారెడ్డి మాట్లాడారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన మద్దతు ధరల్లో శాస్త్రీయత లేదన్నారు. స్వామినాథన్ కమిషన్ సిపారసుల మేరకు సీ2 + 50శాతం (పెట్టుబడి మీద 50శాతం అదనం) ప్రకారం మద్దతు ధరలు ప్రకటించాలన్నారు. కానీ దీనికి విరుద్ధంగా మద్దతు ధరలు ఉన్నాయన్నారు. వ్యవసాయ ఉపకరణాలు, కుటుంబశ్రమ, వ్యవసాయ యంత్రాలు తదితరాల ఆధారంగా పెట్టుబడి నిర్ణయించాల్సి ఉంటే ఉపకరణాలు, కుటుంబశ్రమ ఆధారంగానే పెట్టుబడి నిర్ణయించడం మూలంగా రైతు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ధరల నిర్ణయంలో అశాస్త్రీయత మూలంగా ఏటా దేశవ్యాప్తంగా రైతాంగం రూ.4లక్షల కోట్లు నష్టపోతుందన్నారు. పెట్టుబడి తక్కువ నిర్ణయించడం వల్ల తెలంగాణలో రైతులు రూ.8వేల కోట్లు నష్టపోతున్నారని తెలిపారు. పైగా నిర్ణయించిన ధరలను అమలు చేయకపోవడం వల్ల మరో రూ.4వేల కోట్లు రైతులు నష్టపోతున్నారని తెలిపారు. ధరల నిర్ణయంలో కార్పొరేట్‌కు మేలు చేసేలా ఉన్నాయన్నారు. తెలంగాణ కంటే రెండేళ్ల ముందే 'కాలియా' అనే పేరుతో రైతుబంధు పథకాన్ని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్ ప్రారంభించారని తెలిపారు. రూ.12,500 ప్రతిరైతు ఖాతాలో జమ చేశారన్నారు. రైతుబంధు కంటే ముందే కర్నాటకలో వరికి ఎకరానికి రూ.5000 బోనస్, మహారాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్ పత్తికి రూ.500, కేరళ ప్రభుత్వం క్వింటాల్ ధాన్యానికి రూ.900 వరకు, తమిళనాడు రూ.150 చొప్పున బోనస్‌లు ఇస్తున్నాయన్నారు. తెలంగాణలో 60లక్షల రైతు కుటుంబాలున్నాయని, ఏనాడూ రైతుబంధు 50లక్షలకు మించలేదన్నారు. అంటే పది లక్షల మంది పేద రైతులు రైతుబంధుకు నోచుకోవడం లేదన్నారు. రైతుబీమా పేరిట 31 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.300 చొప్పున ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తుందని తెలిపారు. ఏటా 16వేల మంది రైతులు రాష్ట్రంలో చనిపోతున్నారని వివరించారు.
రిజిస్ట్రేషన్ ఆదాయం భారీగా రాబట్టుకోవడానికే రెవెన్యూ చట్టాల్లో ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చిందన్నారు. దీనివల్ల వ్యవసాయ భూములు రియల్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లాయన్నారు. డిజిటల్ సర్వేకు ముందు చట్టం చేయాలని, రెవెన్యూ సమస్యలు న్యాయసమ్మతంగా పరిష్కారం కావాలంటే జిల్లాస్థాయిలో అఖిలపక్ష కమిటీలు వేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్‌కు అనుకూలమైన చట్టాలు చేస్తున్నాయన్నారు. రైతాంగాన్ని మోసం చేస్తున్నాయన్నారు.
రైతాంగం తరఫున పోరాటం చేసేది సీపీఐ(ఎం) మాత్రమే: పోతినేని
రైతాంగం తరఫున నిఖార్సైన పోరాటాలు చేసేది సీపీఐ(ఎం) మాత్రమేనని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు తెలిపారు. 2003లో దుమ్ముగూడెం ప్రాజెక్టు సాధన కోసం 2,600 కి.మీ నాడు ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా ఉన్న తమ్మినేని వీరభద్రం పాదయాత్ర చేశారని చెప్పారు. సాగునీటి సాధనకు మహారైతు యాత్ర నిర్వహించామన్నారు. 2007లో సీపీఐ(ఎం) పోరాట ఫలితంగా లక్ష ఎకరాల భూములను పేదలకు పంచారని తెలిపారు. పోలవరం రీ డిజైన్ కోసం ఆందోళనలు నిర్వహించామన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని మాటలు చెబుతోందే తప్ప ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. విత్తనం కొనాలంటే కూడా ఆందోళన చెందాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఏదీ నాణ్యమైన విత్తనమో...ఏదీ నాసిరకమో అర్థంకాని పరిస్థితి నెలకొందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇష్టానుసారంగా తరుగు తీస్తున్నారని చెప్పారు. 10 కేజీల తరుగు తీస్తున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదన్నారు. సోమవారం జిల్లా, మండలకేంద్రాల్లో ఖమ్మం జిల్లా రైతాంగ సమస్యలపై ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
డిమాండ్స్...
65 ఏళ్ల రైతులకు కూడా రైతు బీమా వర్తింపజేయాలని బహిరంగసభ డిమాండ్ చేసింది. అసైన్డ్, పోడు భూములకు పట్టాలివ్వాలని, కౌలు రైతులకూ రైతుబంధు, రైతు బీమా వర్తింపజేయాలని బహిరంగసభ డిమాండ్ చేసింది. ఈ బహిరంగసభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వర్లు, మాచర్ల భారతి, యర్రా శ్రీకాంత్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేష్ తదితరులు పాల్గొన్నారు.