Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐలు వ్యవస్థాపక సభ్యులు కొండపల్లి ఉత్తమ్‌కుమార్ సంస్మరణ సభలో వక్తలు
- మొదటి నుంచి వామపక్ష భావజాలమే..
- న్యాయవ్యవస్థపై ఆయనకు ఎనలేని గౌరవం
- 40 ఏళ్లపాటు వివాదరహితుడిగా వృత్తి నిర్వహణ
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
వామపక్ష భావజాలం అణువణువునా ఉన్న ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే కె.ఎల్. నర్సింహారావు వారసుడు కొండపల్లి ఉత్తమ్‌కుమార్ న్యాయవాద వృత్తికే వన్నె తీసుకొచ్చారని.. న్యాయానికి ఆయన సర్వోత్తముడిగా నిలిచారని ఐలు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కొండపల్లి ఉత్తమ్‌కుమార్ సంస్మరణ సభలో వక్తలు పేర్కొన్నారు. ఉత్తమ్‌కుమార్‌పై తొలితరం వామపక్ష నేతలు తరిమెళ్ల నాగిరెడ్డి, ఓంకార్, పాశం యాదగిరి, వరవరరావు దంపతుల ప్రభావం ఉండేదన్నారు. దీనివల్ల ఆయనలో వామపక్ష భావజాలం పెంపొందిందన్నారు. వరంగల్‌కు చెందిన సీనియర్ అడ్వకేట్ అరసనపల్లి వెంకటేశ్వరరావు వద్ద 1980లో ప్రాక్టీస్ మొదలపెట్టారని తెలిపారు. 1984లో ఖమ్మంలో బోడేపూడి రాధాకృష్ణ వద్ద జాయిన్ అయ్యారన్నారు. సీనియర్ న్యాయవాదులు కొల్లి సత్యనారాయణ, జక్కంపూడి నాగేశ్వరరావు, కిలారు బాబ్జి ఆయన సహచరలుగా ఉన్నారని తెలిపారు. వృత్తిపరంగా ఎంఏ ఖయ్యూం, తుళ్లూరి రమేష్, అమ్ములు జైన్‌తో కలిసి ప్రాక్టీస్‌లో చురుకుగా పాల్గొన్నారని తెలిపారు. మల్లాది వాసుదేవ్, కేపీ సత్యనారాయణ, ఆర్.మురళీధర్రావులతోనూ సహచర్యం ఉండేదన్నారు. వివిధ రాజకీయపార్టీల అనుబంధ న్యాయవాద సంఘాలకు చెందిన లాయర్లతో సైద్ధాంతిక పరచర్చలు చేసే వారు తప్ప వ్యక్తిగత దూషణలకు వెళ్లేవారు కాదన్నారు. ఖమ్మం బార్ అసోసియేషన్‌కు అధ్యక్షులుగానూ పనిచేశారని తెలిపారు. ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలు) 1984లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైనప్పటి నుంచి వ్యవస్థాపక సభ్యులుగా కొనసాగారని గుర్తు చేసుకున్నారు. జిల్లా కమిటీ సభ్యుని స్థాయి నుంచి జాతీయ కౌన్సిల్ మెంబర్‌గా కూడా వివిధ స్థాయిల్లో పనిచేశారన్నారు. ముక్కుసూటిగా మాట్లాడే తత్వం, విషయం పట్ల స్పష్టత ఉత్తమ్‌కు మెండుగా ఉండేదన్నారు. కోర్టుల్లోనూ క్లైయింట్లకు న్యాయం చేయడం కోసం తన వృత్తి నైపుణ్యాన్ని పూర్తిగా ప్రదర్శించేవారన్నారు. ఆ సందర్భాల్లో న్యాయమూర్తులతో కూడా చట్టపరమె ౖన అంశాల్లో వాదోపవాదా లకు దిగేవారన్నారు. చాలా మెలకువ తో వృత్తినైపుణ్యాన్ని పెంచుకుంటూ 40 ఏళ్లుగా న్యాయవాద వృత్తిని కొనసాగిం చారని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థపై ఎనలేని గౌరవం ఉండేదన్నారు. కక్షీదారులకు న్యాయం చేయడంలో..న్యాయశాస్త్రాల్లో ఉన్న లొసుగుల పట్ల అవగాహన కలిగి ఉండటంతో పాటు వాటి పరిష్కారం కోసం ఐలు వేదికగా కృషి చేశారన్నారు. ఈ సంస్మరణ సభ నిర్వహించిన జూన్ 13వ తేదీనే ఉత్తమ్ జన్మదినం కూడా కావడం గమనార్హం అని పేర్కొన్నారు. ఉత్తమ్ తల్లి దుర్గాదేవి మహిళా సంఘంలో రాష్ట్రస్థాయి నాయకురాలిగా పనిచేశారని తెలిపారు. తమ్ముడు పావన్ సీఐటీయూ నాయకులుగా, ఆయన చెల్లెలు భర్త వెంకటేశ్వరరావు న్యాయవాదిగా వరంగల్‌లో ప్రాక్టీస్ చేస్తూ చనిపోయారని వివరించారు. కుటుంబసభ్యులందరూ వామపక్ష వాదులుగా ఉండటం విశేషం అన్నారు. ఉత్తమ్ భార్య శోభ ప్రైవేట్ టీచర్‌గా పనిచేస్తున్నారని, ఆయన కుమారులు జైపాల్, రాహుల్ ఇద్దరూ ఉద్యోగాల్లో కొనసాగుతూ వామపక్ష భావజాలంతోనే ఉన్నారన్నారు. ప్రముఖ కవి యాకూబ్ కేఎల్ నర్సింహారావు ఇంట్లో ఉత్తమ్, పావన్ సాంగత్యంలో ఓ బిడ్డగా ఎదగడం విశేషం అన్నారు. ఈ రకంగా సామాజికపర బాధ్యతను కూడా ఉత్తమ్‌కుమార్ కుటుంబం పోషించిందన్నారు. ఉత్తమ్ లేని లోటు ఐలు, న్యాయవాదులకు పూడ్చలేనిదన్నారు. ఆయన మృతికి సంతాపంతెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ అడ్వకేట్ చింతనిప్పు వెంకటేశ్వరరావు వందన సమర్పణ చేశారు. ఐలు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శివరామ్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ ఆన్లైన్ సంస్మరణ సభలో యూనియన్ స్టేట్ సెక్రటరీ, తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్ కొల్లి సత్యనారాయణ, స్టేట్ ప్రెసిడెంట్ జి.విద్యాసాగర్, నేషనల్ కౌన్సిల్ మెంబర్ ఏడునూతల శ్రీనివాస్, ఖమ్మం జనరల్ సెక్రటరీ చింతనిప్పు వెంకటేశ్వరరావు, మల్లాది వాసుదేవ్, పోట్ల మాధవరావు, ఎంఏ ఖయ్యూం, వంజాకు లక్ష్మీనారాయణ, ఉత్తమ్‌కుమార్ సోదరుడు కొండపల్లి పావన్, డీఆర్డీఏ రిటైర్డ్ డైరెక్టర్ వరప్రసాద్, అడ్వకేట్లు కె.రాజశేఖర్‌రెడ్డి, మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు తాజుద్దీన్‌బాబా, ఏపీ రాష్ట్ర ఐలు అధ్యక్షులు ఎస్. రాజేంద్రప్రసాద్, జనరల్ సెక్రటరీ నర్రా శ్రీనివాసరావు, విశాఖపట్టణం నుంచి ఎన్.వెంకటేశ్వరరావు, ఏలూరి నుంచి కట్టా సత్యనారాయణ, కొత్తగూడెం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణ, హైదరాబాద్ అడ్వకేట్ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.