Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల నుంచి అభినందనలు
నవతెలంగాణ-బోనకల్
తాను సర్పంచ్‌ననే అహంకారం కానీ అహంభావం కానీ ఆమెలో లేదు. సర్పంచ్ అయినప్పటికీ ఒక సేవకురాలిగా రెండు నెలల పాటు కరోనా బాధితులకు సేవలు అందించారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి కరోనా బాధితులందరికీ నిత్యం అండగా ఉంటూ మనోధైర్యం కల్పిస్తూ వారి కుటుంబాలకు అండగా నిలిచింది. సర్పంచ్ పదవి రాగానే తనకు ప్రజలతో సంబంధం లేదని భావించే ప్రజాప్రతినిధులకు భిన్నంగా తాను ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ తన శక్తి మేరకు కృషి చేస్తూ మండల ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలిచింది. ఆమె మండల పరిధిలోని తూటికుంట్ల గ్రామపంచాయతీ సర్పంచ్ సీపీఐ(ఎం)కి చెందిన నోముల వెంకట నరసమ్మ.
తూటికుంట్ల గ్రామంలో 55 మంది కరోనా బారిన పడ్డారు. గ్రామంలో కరోనా కేసు నమోదైన ప్రారంభం నుంచి ఆమె బాధితులకు అండగా ఉండేందుకు నడుంబిగించింది. కరోనా సోకిన వ్యక్తులను చూసి ప్రతి ఒక్కరు దూరంగా ఉంటున్నారు. కనీసం కుటుంబ సభ్యులను కూడా పలకరించే పరిస్థితి నెలకొనని సమయంలో నోముల వెంకట నరసమ్మ మాత్రం బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి ధైర్యం చెబుతూ వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ నిత్యం అండగా నిలిచారు. పంచాయతీ ఆధ్వర్యంలో ప్రతిరోజు బాధితులకు కూరగాయలు, పౌష్టికాహారాన్ని ఎంపీపీ కంకణాల సౌభాగ్యంతో కలిసి పంపిణీ చేశారు. పంచాయతీ కార్యదర్శి తాళ్లూరి గోపి, ఉప సర్పంచ్ తుళ్లూరు కొండల్ రావు కూడా సర్పంచ్‌కి నిత్యం తోడుగా ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్స్ నిత్యం సర్పంచ్‌కి చేదోడువాదోడుగా ఉంటూ సహాయ సహకారాలు అందించారు. ప్రారంభంలో కొంత భయపడినా ఆ తర్వాత నిర్వీరామంగా సర్పంచ్‌తో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
గ్రామానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి టెస్టు కోసం వెళ్లాలంటే ప్రజల ఇబ్బందిపడుతుంటే వైద్యాధికారి తాటికొండ శ్రీకాంత్‌తో మాట్లాడి గ్రామంలోనే కరోనా టెస్ట్‌లు నిర్వహించే విధంగా కృషి చేశారు. ఉపాధి హామీ కూలీలకు శానిటైజర్, మాస్కులు, గ్రామపంచాయతీ సిబ్బందికి ఫేస్ షీల్డ్, శానిటైజర్ లు, మాస్కులు పంపిణీ చేశారు. కరోనా బాధితులకు కోడి మాంసం, చేపలు, పండ్లు, రాగి పిండి, శానిటైజర్లు అందజేశారు. అవసరమైన సందర్భాలలో ఆ గ్రామం ఎంపీపీ కంకణాల సౌభాగ్యంతో సీపీఐ(ఎం) నాయకులతో సమన్వయం చేసుకుంటూ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మండల ప్రజాప్రతినిధులకు ఆదర్శ ప్రజాప్రతినిధిగా తన స్థానానికి పేరు తీసుకు వచ్చారు.