Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈసారైనా ముడిపడే నా..
- అధికారుల పర్యవేక్షణ లేదు
- కాంట్రాక్టర్ ఇష్టానుసారం పనులు
నవతెలంగాణ-తల్లాడ
మండలం పరిధిలోని కట్టలేరు వాగుపై కిష్టాపురం వద్దా చెక్ డ్యామ్ నిర్మాణ పనులకు జనవరి నెలలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టర్ పనులు ప్రారంభించారు. ఈ విషయమై పట్టాదారు తన అనుమతి లేకుండా తన భూమిలో నిర్మిస్తున్నారని హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఇంటీరియర్ ఆర్డర్ ఇచ్చింది. ఇరిగేషన్ అధికారులు పట్టా భూమిలో చెక్ డాం నిర్మించడం లేదని కౌంటర్ దాఖలు చేసింది. అనంతరం ఎస్సీ కాలనీ వద్ద ప్రభుత్వ భూమిలో నిర్మాణ పనులు ప్రారంభించారు. అక్కడ రైతులు, ఎస్సీ కాలనీ వాసులు, చెక్‌డ్యాం నిర్మిస్తే తమ పొలాలు మునిగిపోతాయి అని, కాలనీ వరదలో కొట్టుకు పోతుందని పురుగుల మందు డబ్బాలు పట్టుకొని నిరసన తెలపడంతో అక్కడ పనులను నిలిపివేశారు. మరల 99 సర్వే నెంబర్లు ముచ్చటగా మూడోసారి పనులు ప్రారంభించారు. వర్క్ ఆర్డర్ లేదని ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణ లేదని, కాంట్రాక్టర్ తన ఇష్టానుసారం పనులు ప్రారంభించారు.
ఇక్కడ డ్యాం నిర్మిస్తే 340 ఎకరాలకు సాగు నీరు లభిస్తుందని అధికారులు రూ.5:30 కోట్లు వెచ్చించి చెక్ డ్యామ్ నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదనలు పంపారు. గత 20 సంవత్సరాలుగా 340 ఎకరాల్లో, సాగర్ జలాలతో రెండు పంటలు నిర్విరామంగా పండుతున్నాయి. కొత్తగా ఒక ఎకరా భూమి కూడా సాగులోకి రాదు, అయినా పట్టుదలతో అక్కడ చెక్ డాం నిర్మించడం ఎవరి కోసం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గ్రామస్తులు రైతులు వ్యతిరేకిస్తున్న స్థలంలో చెక్ డ్యామ్ నిర్మించి ఎవరికీ న్యాయం చేస్తారో అర్థం కావడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ విషయమై ఇరిగేషన్ ఈఈ చింతా రామకృష్ణను వివరణ కోరగా, ప్రతి సారీ వర్క్ ఆర్డర్ ఇవ్వరని ఒకేసారి ఇస్తారని, సదరు స్థలంలో ఇరిగేషన్ అధికారులు చెక్‌డ్యాం నిర్మించమని కౌంటర్ వేశారు కదా మరలా ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తే, మేము ఈరోజు బిజీగా ఉన్నాం వివరాలు అడగకండి అంటూ సమాధానం దాటవేశారు.