Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పశు వైద్యాధికారిపై దాడి
- బాధితున్ని క్షేమాపణ కోరిన ఎస్సై సురేష్...!
నవతెలంగాణ-ములకలపల్లి
ములకలపల్లి ఎస్సై ఓవర్ యాక్షన్ మరో మారు వివాదాస్పదం అయింది. స్థానిక పశువైద్యుడిపై చేయి చేసుకొని మరో సారి వార్తల్లోకి ఎక్కారు. గత యేడాదిగా ఎస్సైపై మండల వ్యాప్తంగా అనేక ఆరోపణలు, ఆయన అవినీతి, అక్రమాలపై బాధితుల ఆందోళనలు మర్చిపోక ముందే ఆయన కొత్త వివాదానికి తెరలేపారు. స్థానిక పశు వైద్యాధికారి రామకృష్ణ శనివారం రాత్రి తన విధి నిర్వహణలో కుమ్మరిపాడు వెళ్లి పశువులకు చికిత్స అందించి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో పాలు తీసుకునేందుకు ఓ ఇంటిదగ్గర తన కారును నిలిపి ఉంచారు. తన సిబ్బందితో అటుగా వచ్చిన స్థానిక ఎస్సై కారు వద్దకు సిబ్బందిని పంపించారు.
ఎస్సై దగ్గరకు వచ్చిన రామకృష్ణ తనని తాను పరిచయం చేసుకునే క్రమంలో అక్రమ సంబంధం ఆరోపణలు చేస్తూ దాడికి దిగాడు. ఇదెక్కడి అన్యాయం అని రామకృష్ణ ప్రశ్నించగా తాగి రోడ్లపై తిరుగుతున్నావు అంటూ దౌర్జన్యంగా పోలీసు వాహనంలో స్టేషన్కు తీసుకువెళ్లారు. రామకృష్ణకు మద్యం సేవించాడాని పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో సేవించలేదని తేలింది. దీనితో రామకృష్ణను పోలీసులు విడిచిపెట్టారు. అత్యవసర సేవలందించే తనపై ములకలపల్లి ఎస్సై సురేష్, కానిస్టేబుల్ రామారావు అకారణంగా దాడిచేశారని, అనవసర ఆరోపణలు చేశారని, ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అంటూ ఆవేదనతో రామకృష్ణ సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేశారు.
బాధితుడిపై సామ దాన బేద దండోపాయలు
రామకృష్ణపై పోలీసుల దాడి విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాధితుడిపై స్థానిక పోలీసులు బెదిరింపులకు దిగినట్లు, ఎస్సై తన సామాజిక వర్గానికి చెందిన కొందరితో రాజీకి ప్రయత్నం మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు జిల్లా కేంద్రానికి వెళ్లిన బాధితుడి బృందానికి ఎస్సై అడ్డుతగిలి రాజీకి రావాల్సిందిగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.
శనివారం రాత్రి ములకలపల్లి పశు వైద్యాధికారి రామకృష్ణపై జరిగిన దాడి విషయంలో జిల్లా కేంద్రంలో ఇరు శాఖల అధికారులు రాజీ కుదిర్చినట్లు తెలిసింది. దాడిచేసిన విషయంలో ఎస్సై సురేష్ వైద్యాధికారి రెండు చేతులు పట్టుకుని క్షమాపణ కోరినట్లు తెలిసింది. ఈ విషయమై జిల్లా ఎస్పీని సోమవారం కలవనున్నట్టు బాధితుడు రామకృష్ణ మీడియాకు తెలిపారు.