Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బహుళ పంటలు పండే భూములు లాక్కోవొద్దు
- ఆర్డీవోకి సీపీఐ(ఎం) నాయకుల వినతి
నవతెలంగాణ-రఘునాధపాలెం
నాగపూర్ నుండి అమరావతి నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే పేరుతో బలవంతపు భూసేకరణ చేస్తే సహించబోమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ అన్నారు. సోమవారం రఘునాధపాలెం మండలానికి చెందిన భూ నిర్వాసితులు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఖమ్మం ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నున్నా నాగేశ్వరరావు, శ్రీకాంత్‌లు మాట్లాడుతూ బహుళ పంటలు పండే భూములు లాక్కొని, రైతులను రోడ్డుపాలు చేయొద్దని అన్నారు. ఖమ్మం పట్టణం రాబోయే పది సంవత్సరాల్లో ఎటుచూసినా పది కిలోమీటర్ల మేర విస్తరించే అవకాశం ఉన్నదన్నారు. ఈ నేషనల్ హైవే ఖమ్మం పట్టణానికి అతి సమీపంలో వెళుతుండటం వల్ల, పట్టణ విస్తీర్ణానికి ఆటంకంగా మారే ప్రమాదం ఉందన్నారు. కరోనా పేరుతో ప్రజలు ప్రాణాలు పోతున్న ఈ సందర్భంలోనూ భూసేకరణ కోసం గెజిట్ విడుదల చేయడం సరైంది కాదని విమర్శించారు. రైతులకు కనీసం దరఖాస్తు పెట్టుకునే అవకాశం కూడా లేని ఇటువంటి సందర్భాల్లో ఇటువంటి చర్యలకు పూనుకోవడం మంచిది కాదన్నారు. తక్షణమే గెజిట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత సంవత్సరం అనేక పోరాటాల ఫలితంగా గెజిట్ రద్దు చేశారని వారన్నారు. బలవంతపు భూసేకరణ ప్రయత్నిస్తే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ(యం) జిల్లా కమిటీ సభ్యులు నందిపాటి మనోహర్, రఘునాధపాలెం మండల కార్యదర్శి ఎస్.నవీన్ రెడ్డి, నాయకులు పడిగల నాగేశ్వరరావు, రైతులు తక్కెళ్ళపాటి భద్రయ్య, భూక్య కృష్ణ, గుగులోత్ కుమార్ రవీందర్, సత్యనారాయణ నాగండ్ల శ్రీధర్, రమణారెడ్డి, బొజ్జడ్ల వెంకటయ్య, లాయర్ కె.రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.