Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పని చేస్తున్న కార్మికులపై నిత్యం వేదింపులు
- చర్యలు తీసుకోవాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామస్తులు ధర్నా
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండల పరిధిలోని మహదేవపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ నూప సుమిత్ర భర్త అన్నీ తానై ప్రభుత్వ పనులకు వినియోగించాల్సిన ట్రాక్టర్‌ను సొంత పనులకు వినియోగిస్తున్నాడని ఆరోపిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామస్తులు సోమవారం పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సర్పంచ్ భర్త నూప సీతయ్య పాలకవర్గం విషయంలో కూడా నిత్యం జోక్యం చేసుకుంటూ కార్మికులు చేస్తున్న పనులకు సైతం ఆటంకం కల్పిస్తున్నాడని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్‌ను ఇంటి వద్దే ఉంచుకుని ప్రభుత్వ పనులకు ఉపయోగించాల్సిన ట్రాక్టరును రాత్రి పూట ఇసుక తోలకాలకి, ప్రైవేటు కాంట్రాక్టు పనులకు వాడుకుంటూ ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నాడని గ్రామస్తులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. పంచాయతీ కార్మికులు పంచాయతీలో చెత్త సేకరణకు, మొక్కలకు నీరు పోయడానికి ట్రాక్టర్ని పంపండి అని పంచాయతీ కార్మికులు అడిగితే వారిపై సర్పంచ్, ఆమె భర్త దౌర్జన్యం చేయడంతో పాటు గుమస్తా ఉద్యోగం పీకేస్తామని బెరిరింపులకు పాల్పడడంతో పాటు గుమస్తా జానకికి నోటీసులు సైతం అందజేశారు.
ఈ విషయమై గ్రామస్తులు, సీఐటీయూ నాయకులు సర్పంచ్‌కు ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్పందించలేదని సీఐటీయూ నాయకులు, గ్రామస్తులు తెలిపారు. కాగా విషయం తెలుసుకున్న ఎంపీఓ ముత్యారావు ధర్నా ప్రదేశానికి వచ్చి గ్రామస్తులు సీఐటీయూ నాయకులు ఇచ్చిన వినతి పత్రాన్ని తీసుకోవడంతో పాటు రెండు, మూడు రోజుల్లో పాలకవర్గ సమావేశం నిర్వహించి సమస్య పరిష్కారం కోసం కృషి చేయడంతో పాటు త్వరలో గ్రామ సభ నిర్వహించి పూర్తి స్థాయి విచారణ అనంతరం తగు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు. చట్ట పరంగా అధికారులు తగు చర్యలు తీసుకోక పోతే గ్రామస్తుల ఆధ్వర్యంలో మరలా ధర్నా నిర్వహిస్తామని సిఐటియు జిల్లా ఉపాద్యక్షులు బ్రహ్మాచారి అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ కొర్సా చిలకమ్మ, ఉపసర్పంచ్ కె.శాంతమ్మ, వార్డు సభ్యులు సమ్మక్క, బేబీ, వాసుబాబు, మాజీ ఎంపీటీసీ లకీëదేవి, జీపీ వర్కర్స్ నాయకురాలు జానకి, పాపారావు, భవాని, పెద్దలు కాక క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.