Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంగంలోకి దిగిన రైల్వే అధికారులు
నవతెలంగాణ- బోనకల్
బోనకల్ రైల్వే స్టేషన్లో కోతుల బెడద తొలగిపోనున్నది. రైల్వే స్టేషన్లో ప్రయాణికులను కొన్ని సంవత్సరాలుగా కోతులు గడగడలాడి స్తున్ననాయి. బోనకల్ మండల కేంద్రంలో సుమారు ఐదారు సంవత్సరాల నుంచి కోతుల బెడద అత్యంత భయంకరంగా తయారైంది. ఇళ్లల్లోకి సైతం కోతులు చొరబడి ఇంట్లో గల వస్తువులను ఎత్తుకెళ్తున్నాయి. కనీసం ఇంటి ఆవరణలో ఆరవేసిన దుస్తులను సైతం పట్టుకొని చింపి వేస్తున్నాయి. కూరగాయలు, పండ్లు వస్తువులు కొనుక్కొని వెళుతున్న మనుషులపై దాడి చేసి వాటిని ఎత్తుకొని వెళుతున్నాయి. ఏదైనా వస్తువు కొనుగోలు చేసుకొని కనీసం ద్విచక్ర వాహనంపై పెట్టుకునే పరిస్థితి కూడా లేదు. కోతులు గుంపులు గుంపులుగా వచ్చి మనుషులపై దాడులు చేస్తూ అనేకమందిని గాయపరిచాయి. వాహనాలు ఒక చోట పెట్టి తమ పనుల కోసం వెళ్లిన వ్యక్తులు తిరిగి వచ్చేసరికి సీట్లు లేదా పెట్రోల్ ట్యాంక్ సీట్లు కూడా సైతం చింపి పారేస్తున్నాయి. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో అనేకసార్లు కోతులు పట్టించేందుకు ప్రయత్నాలు చేయగా కోతులను పట్టే సిబ్బంది ఒక్కొక్క కోతికి పెద్ద మొత్తంలో నగదు అడగటంతో వదిలివేశారు. రైల్వేస్టేషన్లో గానీ బస్టాండ్ లో గాని తమ తమ వస్తువులతో ఒంటరిగా నిలబడే పరిస్థితి కూడా లేదు. వారి వద్ద ఉన్న వస్తువులపై ఒక్కసారిగా దాడి చేసి చేస్తున్నాయి. రైల్వే స్టేషన్ కు రావాలంటే ప్రయాణికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని రైలు ఎక్కవలసి ఉంటుంది. చివరకు కోతుల బెడద తట్టుకోలేక రైల్వే అధికారులు రంగంలోకి దిగారు. మహబూబాబాద్ కు చెందిన కోతులను పట్టే వారిని రైల్వే అధికారులు సంప్రదించారు. రెండు రోజులుగా రైల్వే స్టేషన్ సమీపంలో ఇనుప బోన్ లను అమర్చి చాకచక్యంగా కోతులను బందిస్తున్నారు. కోతులను బంధించేందుకు పండ్లు, కూరగాయలు బోన్ లో ఎరగా వేస్తున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం, కోతులు రైల్వే విద్యుత్ తీగలపై సంచరిస్తూ విద్యుత్ ఘాతుకానికి గురై చనిపోవడం దాని వలన విద్యుత్ అంతరాయం కలుగుతుంది. దీంతో రైల్వే అధికారులు కోతుల బెడద ఉన్న రైల్వే స్టేషన్లలో కోతులను పట్టిస్తున్నారని, గత నెల రోజులుగా డోర్నకల్, మధిర, తదితర రైల్వేస్టేషన్లో కోతులను పట్టామని, దానిలో భాగంగానే బోనకల్ కు రావడం జరిగిందని కోతుల పట్టే బృందం సభ్యులు తెలిపారు. డోర్నకల్ కు చెందిన కాంట్రాక్టర్ ద్వారా తాము వచ్చామని, ఒక్కొక్క కోతికి 750 రూపాయలు తమకు చెల్లిస్తున్నట్లు తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా కోతులతో ఇబ్బందులు పడ్డ రైల్వేస్టేషన్ లోని ప్రయాణికులు, రైల్వేస్టేషన్ పరిసర ప్రాంత ప్రజలు కోతుల బెడద నుంచి బయట పడుతున్నామని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.