Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాఠశాలలకు మౌళిక వసతులు అంతంత మాత్రమే
- నాలుగేండ్లుగా ఇన్చార్జి విద్యాశాఖ అధికారి పాలనే
- నేటికీ పాఠశాలలకు చేరుకోని ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
కోవిడ్ 19 పుణ్యమా అని విద్యా వవ్యవస్థ గాడి తప్పింది. ఉన్నత స్థాయి విద్యల దగ్గర నుండి కింది తరగతి విద్యల వరకూ తీవ్ర ప్రభావం చూపింది. విద్యార్ధులకు ఉపాధ్యాయుల భోధన ద్వారా ఉన్నతమైన ప్రమాణాలతో విద్యను అందించకుం డానే కోవిడ్ పుణ్యమా అని వారిని ఉన్నత తరగతులకు పంపించాల్సిన పరిస్థితి నెలకొంది. కోవిడ్ మొదటి దశ 2020-2021 విద్యా సంవత్సరం ప్రారంభించకుండానే రాష్ట్ర ప్రభుత్వం వివిధ చానళ్ల ద్వారా విద్యార్ధులు ఇంటి వద్దే ఉండి విద్యను అభ్యశించాలని ఉపాధ్యాయుల పర్యవేక్షణ ఉండాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసినప్పటికీ విద్యార్ధులు పూర్తి స్థాయిలో శ్రద్ధ కనపరచ లేదనే చెప్పవచ్చు. పదవ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో కోవిడ్ నిబందనలు పాటిస్తూ పదవ తరగతి విద్యార్ధులకు కొన్ని రోజుల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించినప్పటికీ కోవిడ్ రెండవ దశ పుణ్యమా అని తరగతులను సైతం నిలిపి వేశారు. దీంతో 2019-2020 విద్యా సంవత్సరంతో పాటు 2020-2021 విద్యా సంవత్సరం సైతం పదవ తరగతి చదువుకున్న విద్యార్దులను పార్మెటివ్ అసెస్ మెంట్ ఆదారంగా గ్రేడ్లు ప్రకారం ఉత్తీర్ణులను చేశారు.
మౌళిక వసతులు అంతంత మాత్రమే : పాఠశాలలకు కల్పించాల్సిన మౌళిక వసతులపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదనే చెప్పవచ్చు. దీంతో ప్రభుత్వ పాఠశాలలు సమస్యలతో సతమతమవుతున్నాయి. కనీస సౌకర్యాలు లేక పాఠశాలలకు వచ్చే ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు సమస్యలు స్వాగతం పలికేలా దర్శనమిస్తున్నాయి. పాఠశాల ప్రాంగణాలన్నీ మొక్కలతో చిట్టడువులను తలపిస్తున్నాయి. మరుగు దొడ్లు, మేత్రశాలలు వృధా పడి ఉన్నాయి. పాఠశాలలు, గిరిజన వసతి గృహాలలో తాగు నీటి కోసం ఏర్పాటు చేసిన నల్లా కనెక్షన్లు, కుళాయిలు వృధాగా పడి ఉన్నాయనే చెప్పవచ్చు. కొన్ని పాఠశాలలు, ఆకతాయిలకు, మందు బాబులకు అడ్డాగా మారాయనే చెప్పవచ్చు.
నాలుగేండ్లుగా ఇన్చార్జి విద్యాశాఖ అధికారి పాలనే : విద్యాశాఖలో సమూలమైన మార్పులు లేక పోవడం వలన గత నాలుగు సంవత్సరాలుగా ఇన్చార్జీ విద్యాశాఖ అధికారితోనే మండల విద్యా వ్యవస్థను నడిపించాల్సిన దుస్థితి నెలకొంది. మండల ఇన్చార్జీ విద్యాశాఖ అధికారిగా సున్నం సమ్మయ్యను 2017లో నియమించారు. అప్పటి ఆయనే నేటికీ కొనసాగుతున్నారు. కాగా ఆయనకు భద్రాచలంతో పాటు, బూర్గంపహాడ్ మండలాలకు సైతం ఇన్చార్జీ విద్యాశాఖ అధికారిగా అదనపు భాద్యతలు అప్పగించారు. కాగా పూర్తి స్ఘాయి విద్యాశాఖ అధికారిని నియమంచాలని, ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించి ప్రభుత్వ విద్యను గాడిలో పెట్టాలని పలు ఉపాద్యా సంఘాలు అనేక మార్లు ధర్నాలు, వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ నేటికీ విద్యా వ్యవస్థలో మార్పు రాలేదనే చెప్పవచ్చు.
నేటికీ పాఠశాలలకు చేరుకోని పాఠ్య పుస్తకాలు : ప్రభుత్వ లెక్కల ప్రకారం జూన్ 2 నుండి విద్యా సంవత్సరం ప్రారంభం కావాలి. కోవిడ్ రెండవ దశ కరోనా కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ జూన్ 15 నుండి పాఠశాలలు తెరవాలని, 8, 9, 10 తరగతులకు చెందిన విద్యార్ధులకు ఆన్లైన్ క్లాసులు బోధించాలని నిర్ణయించారు. కాగా విద్యార్ధులకు అందజేయాల్సిన పాఠ్య పుస్తకాలు మాత్రం నేటికీ పాఠశాలలకు చేరుకోలేదు. ఈ విషయమై మండల విద్యాశాఖ అధికారి సున్నం సమ్మయ్యను నవతెలంగాణ వివరణ కోరగా జిల్లా విద్యాశాఖ గోడౌన్‌కు 60 శాతం వరకు పాఠ్య పుస్తకాలు చేరుకున్నాయని త్వరలో మండల విద్యా వనరుల కేంద్రంకు వస్తాయని వచ్చిన వెంటనే పాఠశాలలకు అందజేస్తామని ఆయన తెలిపారు.